Mamata Banerjee: వాటిపైనా జీఎస్టీ విధిస్తే ఇక ప్రజలేం తింటారు?: భాజపాపై దీదీ ఫైర్‌

దేశంలో భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తోందని బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. .....

Updated : 21 Jul 2022 15:49 IST

కోల్‌కతా: దేశంలో భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ నాశనం చేస్తోందని బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మండిపడ్డారు. 2024లో దేశ ప్రజలు ఇవ్వబోయే తీర్పుతో కేంద్రంలో భాజపా అధికారం కోల్పోతుందని వ్యాఖ్యానించారు. దేశ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ పతనం కావడం పట్ల దీదీ ఆందోళన వ్యక్తంచేశారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన భారీ ర్యాలీకి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడారు. బొరుగులు, పాలపొడి వంటి వస్తువులపైనా భాజపా జీఎస్టీ అమలుచేస్తోందని.. మరి ప్రజలు ఏం తింటారు? ఈ దేశంలో పేదలు ఎలా బతకాలి? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. 

భాజపా చెరశాలను బద్దలు కొట్టి.. ప్రజా ప్రభుత్వం తీసుకురండి..

మహారాష్ట్రలో చేసినట్టుగా బెంగాల్‌ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నిస్తే తగిన రీతిలో సమాధానమిస్తామని భాజపా శ్రేణులకు దీదీ హెచ్చరించారు. అగ్నిపథ్‌ పథకం పేరిట కేంద్ర సాయుధ బలగాలను కూడా నిర్వీర్యం చేస్తోందని భాజపాపై మండిపడ్డారు. బెంగాల్‌కు పెండింగ్‌లో ఉన్న నిధుల్ని మంజూరు చేయకపోతే దిల్లీలో భాజపా నాయకత్వాన్ని ఘెరావ్‌ చేస్తామని హెచ్చరించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేని వాళ్లు ఇప్పుడు దేశ చరిత్రను తిరగరాయాలని ప్రయత్నిస్తున్నారంటూ దీదీ ధ్వజమెత్తారు. భాజపా చెరను బద్దలుకొట్టి.. 2024లో కేంద్రంలో ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఇతర రాష్ట్రాల్లోనూ సీట్లు గెలుచుకుంటాం: అభిషేక్‌

బెంగాల్‌ వెలుపల కూడా తృణమూల్‌ కాంగ్రెస్‌ని విస్తరించే ప్రణాళికలు కొనసాగుతున్నాయని.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బయట రాష్ట్రాల్లోనూ సీట్లు గెలుచుకుంటామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ విశ్వాసం వ్యక్తంచేశారు. వచ్చే ఏడాది జరగబోయే పంచాయతీ ఎన్నికలకు ప్రతిభ ఆధారంగానే టిక్కెట్లు ఇస్తాం తప్ప సిఫారసులు పనిచేయవని తేల్చి చెప్పారు. అవినీతికి పాల్పడకుండా తమ పార్టీలోని ఓ వర్గాన్ని హెచ్చరించిన అభిషేక్‌.. పార్టీ క్రమశిక్షణకు ఎవరూ అతీతులు కాదన్నారు.

1993లో అప్పటి లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం హయాంలో యూత్‌ కాంగ్రెస్‌ ర్యాలీపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13మంది మృతిచెందారు. దీంతో వారి సంస్మరణార్థం ఏటా జులై 21న తృణమూల్‌ కాంగ్రెస్‌ అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని