Andhra News: వైకాపా హయాంలోనే అప్పులు తక్కువ

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు.

Updated : 25 Jun 2022 08:18 IST

రాష్ట్రం రుణ ఊబిలో కూరుకుపోయిందని ప్రతిపక్షాల దుష్ప్రచారం
విలేకర్లతో ఆర్థిక మంత్రి బుగ్గన

ఈనాడు, అమరావతి: రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై  కేంద్రాన్ని తప్పుదోవ పట్టించేలా రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తోందంటూ ప్రతిపక్ష నేతలు మాట్లాడడం భావ్యం కాదన్నారు. సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, వివిధ ఆర్థిక సంస్థలు, పార్లమెంటు, ప్రజల్లో ప్రభుత్వంపై చెడు అభిప్రాయాన్ని తీసుకొచ్చేలా తెదేపా వ్యవహరిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్రానికి సాయం అందకుండా చేయాలన్నదే ప్రతిపక్షం ఆలోచన. తెదేపా ఆరోపణలు వాస్తవమైతే 2021-22లో ద్రవ్యలోటు 2.10 శాతంగా ఎలా ఉంటుంది? కాగ్‌  నివేదికను కూడా ప్రతిపక్షాలు నమ్మవా? 2014-15లో 3.95 శాతంగా ఉన్న ద్రవ్యలోటు తెదేపా హయాంలో ఏనాడూ 4 శాతానికి తగ్గలేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక కొవిడ్‌ కారణంగా 2020-21లో మాత్రం ద్రవ్యలోటు 5.44 శాతంగా ఉంది. 2021-22లో 2.10 శాతానికి తగ్గింది. గత ప్రభుత్వ హయాంలో ఏటా సగటున 19.46 శాతం కొత్త అప్పులు తెస్తే.. మేం 15.77 శాతమే తెచ్చాం. అలాంటప్పుడు రాష్ట్రాన్ని వైకాపా అప్పుల ఊబిలో నెట్టేసిందని.. ఆంధ్రప్రదేశ్‌ శ్రీలంక మాదిరిగా అవుతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమా? ఉపాధి హామీ పథకం కింద తెదేపా ప్రభుత్వం అయిదేళ్లలో రూ.27,340 కోట్లతో పనులు నిర్వహిస్తే.. మేం మూడేళ్లలోనే రూ.27,448 కోట్లు ఖర్చు చేశాం’ అని పేర్కొన్నారు.

సగటు వడ్డీ రేటూ తక్కువే

‘రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకునే రుణాలపై (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్‌- ఎస్‌డీఎల్‌) 2014-15లో సగటు వడ్డీ రేటు 8.6 శాతం కాగా 2021-22లో అది 7.2 శాతమే. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లుల బకాయిల కింద రూ.2,200 కోట్లు 14, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్‌ సంస్థలకు చెల్లించాం. రాష్ట్రంలో పన్ను వసూళ్లు పెరుగుతున్నాయంటే ఆర్థిక వృద్ధి ఉన్నట్లే కదా? తెదేపా హయాంలో 2018-19లో బడ్జెట్‌ అంచనాల్లో 86.25 శాతం ఖర్చు చేసింది. మేం 2021-22లో కేటాయింపుల్లో 96 శాతం ఖర్చు పెట్టాం. ఎగుమతుల్లో దేశంలో ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరాం’ అని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు చెల్లించడానికి సగటున 10 రోజులు పడితే.. ఇప్పుడు 3-4 రోజుల్లోనే ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ఉద్యోగులకు జీతాల చెల్లింపు ఎందుకు ఆలస్యమవుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. సిబ్బందికి చెల్లించాల్సిన పీఎఫ్‌, వైద్య ఖర్చులు మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని