Chirag Paswan: బిహార్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయండి.. కేంద్రానికి చిరాగ్ విజ్ఞప్తి

బిహార్‌లో మద్యం మాఫియా పెట్రేగిపోతోందని ఎంపీ చిరాగ్‌ పాసవాన్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతిపాలన విధించాలని కేంద్రాన్ని కోరారు.

Published : 29 Dec 2022 01:17 IST

దిల్లీ: బిహార్‌(Bihar)లోని నీతీశ్‌ కుమార్‌(Nitish kumar) ప్రభుత్వంపై లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌ పాసవాన్‌) అధ్యక్షుడు, ఎంపీ చిరాగ్‌ పాసవాన్‌(Chirag paswan) తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన కుప్పకూలిపోయిందన్న ఆయన‌.. బిహార్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో అధికారుల అండదండలతో మద్యం మాఫియా పెట్రేగిపోతోందన్నారు. బిహార్‌లో మద్య పాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ మద్యం విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతుండటంతో విషపూరిత మద్యం తాగి అనేకమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. భూ, గనుల మాఫియాలకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని.. నేరగాళ్లు రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. బిహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.

2020లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నీతీశ్‌కుమార్‌తో తీవ్ర విభేదాలకారణంగా ఎన్డీయే కూటమి నుంచి చిరాగ్‌ వైదొలిగిన ఇషయం తెలిసిందే. అయితే, నీతీశ్‌ కుమార్‌ అనూహ్యంగా భాజపా కూటమిని వీడి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్లీ చిరాగ్ భాజపాకు దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని