BRS: ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతం: సీఎం కేసీఆర్‌

భారాసా ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తదితరులు హాజరయ్యారు.

Updated : 18 Jan 2023 19:56 IST

ఖమ్మం: ఖమ్మం సభ దేశంలో ప్రబల మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఖమ్మం చరిత్రలోనే ఇది అద్భుత భారీ బహిరంగ సభ అని తెలిపారు. భారీగా తరలివచ్చిన గులాబీ శ్రేణులనుద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... భారాస విధానం, వ్యూహం తర్వాత వివరంగా చెబుతామన్నారు.

‘‘భారత్‌ అన్ని విధాలా సుసంపన్నమైన దేశం. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామి. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కానీ, కేవలం 20వేల టీఎంసీలు మాత్రమే వాడుకుంటున్నాం. బకెట్‌ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాస్తోంది. చైనాలో 5వేల టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్‌ ఉంది. మన దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్‌ ఉందా? రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చింది. కెనడా నుంచి కందిపప్పు దిగుమతి సిగ్గుచేటు కాదా? రూ.లక్ష కోట్ల విలువైన పామాయిల్‌ దిగుమతి చేసుకుంటున్నాం. దేశానికి నిర్దిష్ట లక్ష్యం లేకుండా పోయింది. ఈ దేశంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ 4.10లక్షల మెగావాట్లు. దేశం ఎప్పుడూ 2.10లక్షల కోట్ల మెగావాట్లు మించి వాడలేదు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. వీటన్నింటిని రూపుమాపేందుకే భారాస ఆవిర్భవించింది.  దేశ దుస్థితికి కాంగ్రెస్‌, భాజపానే కారణం. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే భాజపాను తిడుతుంది. భాజపా అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుంది. భారాస అధికారంలోకి వస్తే రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్‌ను తయారు చేస్తాం. దేశంలో రైతులకు ఉచిత కరెంట్‌ ఇవ్వాల్సిందే. భారాస అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌ ఇస్తాం. రైతు బంధు స్కీమ్‌  దేశమంతా అమలు చేయాలన్నదే భారాస విధానం. ఎన్‌పీఏల పేరుతో రూ.14లక్షల కోట్లు దోచి పెట్టారు’’ అని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు.

దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే భారాస..

‘‘దళిత బంధు దేశమంతా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఏటా దేశంలోని 25లక్షల కుటుంబాలకు అమలు చేయాలి. మీరు చేయకపోతే మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తాం. ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా? ఎల్‌ఐసీ కోసం భారాస పోరాడుతుంది. విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది. దేశంలో మత పిచ్చి రేపుతున్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వం. విశాఖ ఉక్కును మోదీ అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక కొంటాం. మేకిన్‌ ఇండియా జోక్‌ ఇన్‌ ఇండియాగా మారింది. తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తాం. భారాస అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌. 150 మంది మేధావులు భారాస విధానాలు రూపొందిస్తున్నారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే భారాస. అధికారంలోకి వస్తే అగ్ని పథ్‌ను రద్దు చేస్తాం’’ అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఖమ్మం ప్రజలకు సీఎం కేసీఆర్‌ వరాలు

ఖమ్మం సభలో జిల్లా వాసులకు సీఎం కేసీఆర్‌ వరాలు ప్రకటించారు. ‘‘జిల్లాలోని మొత్తం 589 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షల చొప్పున, జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30కోట్ల చొప్పున, ఖమ్మం మున్సిపాలిటికీ రూ.50కోట్లు మంజూరు చేస్తున్నా. 10వేల జనాభా దాటిన మేజర్‌ పంచాయతీలకు రూ.10కోట్ల నిధులు కేటాయిస్తున్నాం. మున్నేరు నదిపై వంతెన మంజూరు చేస్తాం. జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఖమ్మం జిల్లాకు ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేస్తున్నాం. ప్రభుత్వ స్థలం దొరక్కపోతే సేకరించైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా’’ అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

భారాస ఆవిర్భావం తర్వాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం సభకు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ తదితరులు హాజరుకావడంతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఖమ్మం పట్టణం జనసంద్రంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని