Karnataka Elections: ఏం చేయాలో నెంబర్లే నిర్ణయిస్తాయ్‌..: ఖర్గే

జేడీఎస్‌ (JDS) నాయకత్వంతో పొత్తులపై ఎలాంటి చర్చలు జరపలేదని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) అన్నారు. ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలిచామన్న దానిబట్టి ఏం చేయాలన్నది నిర్ణయించుకుంటాని చెప్పారు.

Published : 13 May 2023 01:42 IST

దిల్లీ: కర్ణాటక ఎన్నికల ఫలితాలకు (Karnataka Elections Results) ముందు రోజు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ హంగ్‌ ఏర్పడితే హెచ్‌డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ (JDS) కింగ్‌ మేకర్ పాత్ర పోషిస్తుందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భాజపా పన్నిన ‘ఆపరేషన్‌ కమలం’ వ్యూహం ఎంత వరకు పని చేస్తుందని విలేకరులు ప్రశ్నించగా.. ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొనేందుకు భాజపా వేసిన కుట్రకు ఆపరేషన్‌ కమలం అని పేరుపెట్టుకున్నారు తప్ప.. అంతకు మించి ఏమీ లేదని ఖర్గే వ్యాఖ్యానించారు. శనివారం వెల్లడయ్యే ఫలితాల్లో ఎన్ని సీట్లు గెలుచుకున్నామన్న దాని బట్టి ఏం చేయాలో నిర్ణయించుకుంటామని అన్నారు.

జేడీఎస్‌తో ఒప్పందానికి తాను సంప్రదింపులు జరుపుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖర్గే కొట్టిపారేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ పార్టీతో కలిసి పని చేయాలన్నదానిపై ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘మాలో ఎవరూ, ఎవర్నీ కలవలేదు. పొత్తుల గురించి మాట్లాడలేదు’’ అని ఖర్గే అన్నారు. మరోవైపు దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, జేడీఎస్‌ కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని చెప్పాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా భాజపా అవతరించినప్పటికీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్‌ సంఖ్యను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే, భాజపాకి వలసలు పెరిగిపోవడంతో 14 నెలలకే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్‌, భాజపా నుంచి తమ పార్టీకి ఆహ్వానం అందిందని, దీనిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు జేడీఎస్‌ నాయకుడు తన్వీర్‌ అహ్మద్‌ గురువారం వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా చర్చ ఊపందుకుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అందుకు అనుగుణంగా ఉండటంతో భాజపా-జేడీఎస్‌ పొత్తుపై ఊహాగానాలకు తెరలేచింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గానూ 150 చోట్ల విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 113 స్థానాలు సాధించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని