Yogi Adityanath: కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే 1947లోనే రామమందిరాన్ని నిర్మించేది: యూపీ సీఎం

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath) మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రామమందిరం అంశాన్ని ప్రస్తావించారు. 

Published : 07 Nov 2023 18:25 IST

భోపాల్: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ఎన్నికల ప్రచారం సందర్భంగా యూపీ (Uttar Pradesh) సీఎం యోగి ఆదిత్యనాథ్‌  (Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ రామమందిరాన్ని ఈ పాటికే నిర్మించేదని అన్నారు. ఖటేగావ్‌లో భాజపా నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యోగి మాట్లాడుతూ ‘1947లోనే అయోధ్యలో కాంగ్రెస్ రామమందిరాన్ని నిర్మించి ఉండవచ్చు. సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌ దాన్ని కోరుకున్నారు. కానీ, కాంగ్రెస్‌ నాయకత్వం అందుకు అంగీకరించలేదని’ చెప్పారు. రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్‌ తొలి నుంచీ వ్యతిరేకమేనని యోగి ఆరోపించారు. మందిరం నిర్మాణ విషయమై ఆందోళన మొదలైనప్పుడు రాముడు అసలు ఉనికిలోనే లేడని ఆ పార్టీ నేతలు ప్రచారం చేయడం ప్రారంభించారని విమర్శించారు. అత్యంత పురాతన నేపథ్యమున్న పార్టీ.. వీరులను, స్ఫూర్తి చిహ్నాలను తొలగించిందని ఆక్షేపించారు. 

ఆ ‘రెడ్‌ డైరీ’లో ఏం ఉందో చెప్పి.. తర్వాత ఓట్లడగండి: అమిత్ షా డిమాండ్‌

నక్సలిజం, ఉగ్రవాదం, అవినీతి దేశానికి పెను సవాలుగా మారిన సమయంలో కాంగ్రెస్‌ దేశం గురించి పట్టించుకోకుండా ఒక కుటుంబ సేవలో తరించిందని దుయ్యబట్టారు. ఆ ఒక్క కుటుంబం, కాంగ్రెస్‌ను వేర్వేరుగా చూడలేమన్నారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్‌ పార్టీ సమస్యలకు పర్యాయపదంగా నిలిచిందన్నారు. 

మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామమందిర నిర్మాణం ఘనత మొత్తం భాజపాకే చెందదని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చొరవతోనే తాత్కాలిక మందిరం తాళాలు తెరుచుకున్నాయని గుర్తు చేశారు. అందువల్లే 1986లో పూజలు చేయగలిగారన్నారు. రామమందిరం ఈ దేశంలోని ప్రతి వ్యక్తికీ చెందినదని అన్నారు. కమల్‌నాథ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాజాగా ఎన్నికల ర్యాలీలో యోగి మాట్లాడారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 17న ఆ రాష్ట్రంలో పోలింగ్‌ జరగనుంది. డిసెంబరు 3న ఫలితాలు వెలువడనున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని