Red Diary: ఆ ‘రెడ్‌ డైరీ’లో ఏముందో చెప్పి.. తర్వాత ఓట్లడగండి: అమిత్ షా డిమాండ్‌

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ ‘రెడ్‌ డైరీ’లో ఏముందు ముందు చెప్పి.. ఆ తర్వాతే ప్రజల్ని ఓట్లు అడగాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా డిమాండ్‌ చేశారు.

Updated : 07 Nov 2023 17:30 IST

జైపుర్‌: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌, భాజపా మధ్య నువ్వానేనా అన్నట్లుగా జరుగుతున్న ఈ ఎన్నికల ప్రచార హోరులో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికారం నిలుపుకోవాలని కాంగ్రెస్‌, ఈసారి గెలిచితీరాలన్న కసితో భాజపా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మక్రానాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల్ని ఓట్లు అడిగే ముందు అసలు ఆ ‘రెడ్‌ డైరీ’లో ఏం రాసుకున్నారో వెల్లడించాలన్నారు. ఈ ‘రెడ్‌ డైరీ’ అంశంపై మంత్రిపై చర్యలు తీసుకోవడం కాదు.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని చేయాలని అమిత్‌ షా డిమాండ్‌చేశారు. 

కాంగ్రెస్‌ అధికారంలో వచ్చినప్పుడల్లా.. రెచ్చిపోతున్న నక్సలైట్లు: ప్రధాని మోదీ

ఎక్కడా లేనన్ని పేపర్‌ లీకేజీలు ఇక్కడే.. 

‘‘కాంగ్రెస్‌ కుటుంబ పార్టీ.  సోనియా గాంధీ తన కుమారుడిని ప్రధాని చేయాలనుకుంటుంటే.. ఇక్కడ సీఎం గహ్లోత్‌ తన కుమారుడిని ఆవిష్కరించాలనుకుంటున్నారు. అయినా కుదరడంలేదు. రాజస్థాన్‌ ప్రజలు కుటుంబ రాజకీయాలను అంగీకరించరు. కాంగ్రెస్‌ నేతలు తమ వారసులను ప్రయోగిస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే చంద్రయాన్‌ను ప్రయోగించారు. జాబిల్లిపైకి త్రివర్ణపతాకాన్ని పంపించారు.  గహ్లోత్‌ సర్కార్‌ ఐదేళ్లలో అవినీతిలో అన్ని పరిమితులు దాటేసింది. దేశంలో ఎక్కడా జరగనన్ని పరీక్ష పేపర్‌ లీకేజీలో రాజస్థాన్‌లోనే జరిగాయి.  గత నాలుగేళ్లలో 14 వేర్వేరు పరీక్ష పేపర్లు లీక్‌ చేయడం ద్వారా లక్షలాది మంది యువతకు ద్రోహం చేశారు. గహ్లోత్‌ తన ఇమేజ్‌ని మరింతగా పెంచుకొనేందుకు రెండేళ్లలోనే రూ.2వేల కోట్లు ఖర్చు చేశారు’’ అని అమిత్‌ షా ఆరోపించారు. 

అసలేంటీ  రెడ్‌ డైరీ?

ఈ ఏడాది జులైలో రాజస్థాన్‌లో రెడ్‌ డైరీ కలకలం రేపిన విషయం తెలిసిందే. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన రాజేంద్ర గుఢా అసెంబ్లీలో ‘రెడ్‌ డైరీ’ ప్రస్తావన తీసుకురావడం దుమారం రేపింది. రాజస్థాన్‌ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌లో అవకతవకలకు సంబంధించి ఛైర్మన్‌ ధర్మేంద్ర రాథోడ్‌ ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాల సమయంలో సీఎం సూచన మేరకు తాను రెడ్‌ డైరీని జాగ్రత్త పరిచానని గుఢా తెలిపారు. సీఎం అశోక్‌ గహ్లోత్‌, ఆయన తనయుడు వైభవ్‌ గహ్లోత్‌ల సూచన మేరకు డబ్బును ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు రాథోడ్‌ అందులో రాశారని గుఢా చెప్పిన అంశాలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని