Congress President Poll: థరూర్‌ Vs ఖర్గే.. నామినేషన్లు వేసిన నేతలు

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే. ఎంపీ శశిథరూర్‌ నామినేషన్‌ సమర్పించారు. బరిలోకి దిగిన మరో నేత ఖర్గే కూడా నామినేషన్‌ వేశారు.

Updated : 30 Sep 2022 14:46 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల పర్వం మొదలైంది. దీంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఈ పదవికి పోటీ చేస్తానని అందరికంటే ముందే ప్రకటించిన తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మధ్యాహ్నం డప్పు వాయిద్యాలు, అభిమాన కార్యకర్తల గణంతో థరూర్‌ ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఛైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీకి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌ వేసేముందు ఈ ఉదయం థరూర్‌ రాజ్‌ఘాట్‌ వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

ఖర్గే గెలుపు ఖాయమేనా?

అటు సీనియర్‌ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే కూడా నామినేషన్‌ వేశారు. అధ్యక్ష పదవికి ఆయన చివరి నిమిషంలో బరిలోకి దిగారు. ఈ పదవికి పోటీ చేయాలని పార్టీ హైకమాండ్‌ ఖర్గేను కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖర్గేకు మద్దతుగా మరో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ నుంచి వైదొలిగారు. గాంధీ విధేయుడిగా పేరున్న ఖర్గేకు హైకమాండ్‌ మద్దతుతో పాటు పార్టీలో అత్యధికుల అండ ఉంది. అశోక్‌ గహ్లోత్‌, దిగ్విజయ్‌, ముకుల్ వాస్నిక్‌ వంటి సీనియర్‌ నేతలు సహా జీ23 నేతలైన మనీశ్ తివారీ, ఆనంద్‌ శర్మ వంటి వారు కూడా ఖర్గేకే మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన గెలుపు ఖాయమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరో నామినేషన్‌..

ఇదిలా ఉండగా.. అధ్యక్ష పదవికి మరో నామినేషన్‌ కూడా దాఖలైంది. అధ్యక్ష పదవికి తాను కూడా పోటీ చేస్తున్నట్లు ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కేఎన్‌ త్రిపాఠి ప్రకటించారు. ఆయన కూడా నేడు నామినేషన్‌ వేశారు. నామపత్రాల దాఖలుకు శుక్రవారమే చివరి రోజు. అక్టోబరు 1న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 8 వరకు గడువు ఉంది. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబరు 17న ఎన్నిక నిర్వహించనున్నారు. అక్టోబరు 19న ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని