CM Bommai: కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ చాలా తక్కువగా చూస్తోంది. : సీఎం బొమ్మై

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రచారంలో  భాగంగా కాంగ్రెస్‌ (KPCC) చీఫ్‌ డీకే శివకుమార్‌ ప్రజల పట్ల వ్యవహరించిన తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడం కోసం డీకే ఎంతకైనా దిగజారతారని ఆరోపించారు.

Published : 29 Mar 2023 17:24 IST

బెంగళూరు: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ (KPCC) చీఫ్‌ డీకే శివకుమార్‌ (DK Shivakumar) ప్రజల పట్ల వ్యవహరించిన తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీకే ప్రజలను మభ్యపెడుతున్నారని ఎన్నికల్లో గెలవడం కోసం ఎంతకైనా దిగజారతారని ఆరోపించారు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ తక్కువగా చూస్తోందన్నారు. మాండ్య జిల్లాలో బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శివకుమార్‌ తన ప్రచార రథం పైనుంచి ప్రజలపైకి కరెన్సీ నోట్లను విసురుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాంగ్రెస్‌లో ప్రధాన నేతగా ఉండి సీఎం అభ్యర్థిగా పోటీపడుతున్న శివకుమార్‌ చర్య విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం భాజపాకు అస్త్రంగా మారింది. దీంతో ఆయనపై భాజపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. 

‘‘ఎన్నికల్లో గెలవడం కోసం శివకుమార్‌ ఎంతకైనా దిగజారుతారు. ప్రజలను ప్రలోభ పెట్టడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తారు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ చాలా తక్కువగా చూస్తోంది. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. ప్రజలే అసలైన నాయకులు’’ అని బొమ్మై పేర్కొన్నారు. భాజపా ఐటీ విభాగం అధిపతి అమిత్‌ మాలవీయా (Amit Malviya) సైతం కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ‘ప్రజలపైకి శివకుమార్‌ విసిరిన నోట్లు అవినీతి సొమ్ము’ అని ఆరోపించారు.  కర్ణాటకలో ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో భాజపా చేస్తున్న అభివృద్ధి పనులను నిలివేస్తుందన్నారు. ఆ పార్టీ పూర్తిగా చీలిపోయిందని, కనీసం సీఎం అభ్యర్థి కూడా లేరని ఎద్దేవా చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని