Shashi Tharoor: పార్లమెంట్‌ను ‘రబ్బర్‌ స్టాంప్‌’గా మార్చేశారు: శశి థరూర్‌

భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ()Shashi Tharoor) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వం పార్లమెంట్‌ను నోటీసు బోర్డు, రబ్బర్‌ స్టాంప్‌గా మార్చేసిందని దుయ్యబట్టారు.

Published : 21 Jan 2023 01:37 IST

జైపుర్‌: ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించే పార్లమెంట్‌ను ప్రస్తుత భాజపా ప్రభుత్వం ‘నోటీసు బోర్డుగా, రబ్బరు స్టాంప్‌గా’ మార్చేసిందంటూ కాంగ్రెస్‌ (Congress) ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) విమర్శించారు. రాజస్థాన్‌లో జైపుర్‌లో జరిగిన లిటరేచర్‌ ఫెస్టివల్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ మాదిరిగా ఉందంటూ కేంద్రాన్ని దుయ్యబట్టారు.

ఈ సాహిత్య ఉత్సవంలో భాగంగా ‘ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం- బలోపేతం చేసుకోవడం’ అనే అంశంపై థరూర్‌ ప్రసంగించారు. ‘‘ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించకుండానే ఈ ప్రభుత్వం (ఎన్డీయేను ఉద్దేశిస్తూ) అనేక నిరంకుశ నిర్ణయాలు తీసుకుంది. దీన్ని అప్రకటిత ఎమర్జెన్సీగా అభివర్ణించొచ్చు. వీటన్నింటినీ వారు రాజ్యంగం, చట్టం పరిధిలోనే చేశారు. ఉదాహరణకు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) చట్టాన్నే (UAPA) చూడండి. ఇప్పటికే బలంగా ఉన్న ఆ చట్టాన్ని మరింత కఠినంగా మార్చారు. దీంతో జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌ లాంటి వారికి బెయిల్‌ కూడా రానియ్యకుండా రెండేళ్లు జైలుకు పంపించారు. ఇలాంటి సంఘటలనల వల్ల మన రాజ్యాంగాన్ని చాలా సులభంగా అప్రజాస్వామిక మార్గంలోకి మారుస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి’’ అని థరూర్‌ అన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడంలో పార్లమెంట్‌ (Parliament) సమర్థతపై అడిగిన ప్రశ్నకు థరూర్‌ బదులిస్తూ.. ‘‘నెహ్రూ హయాంలో పార్లమెంట్‌లో అధికార పార్టీ సభ్యులు కూడా ప్రధానిని ఛాలెంజ్‌ చేస్తూ ప్రశ్నలు వేసేవారు. 1962తో చైనాతో యుద్ధం సమయంలోనూ నాటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌కు జవాబుదారీగా వ్యవహరించారు. కానీ నేడు పరిస్థితులు చాలా మారాయి. ప్రస్తుత ప్రభుత్వం విజయవంతంగా మన పార్లమెంట్‌ను నోటీసు బోర్డు, రబ్బర్‌ స్టాంప్‌ స్థాయికి తగ్గించింది. ప్రభుత్వం తాము చేయాలనుకున్న పనులను చెప్పేందుకు నోటీసు బోర్డుగా మారింది. ఇక మెజార్టీ సభ్యుల గళాన్ని అణచివేసి.. ప్రతి బిల్లును కేబినెట్‌ నుంచి వచ్చిన విధంగా యథావిధిగా ఆమోదించుకునేలా పార్లమెంట్‌ను రబ్బరు స్టాంప్‌ (Rubber Stamp)గా మార్చేశారు’’ అని థరూర్ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని