Delhi: హస్తినలో రాజకీయ వేడి.. డిసెంబరులో దిల్లీ కార్పొరేషన్‌ ఎన్నికలు

దేశ రాజధాని దిల్లీలో  ఎన్నికల వేడి రాజుకోనుంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ దిల్లీ (ఎంసీడీ) ఎన్నికలకు నగరా మోగింది. డిసెంబరు 4 పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Published : 05 Nov 2022 01:38 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల వేడి రాజుకోనుంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ దిల్లీ (ఎంసీడీ) ఎన్నికలకు నగరా మోగింది. మొత్తం 250 వార్డులున్న ఎంసీడీకి డిసెంబరు 4 పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబరు 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపింది. నవంబరు 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డా.విజయ్‌దేవ్‌ తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను నవంబరు 7న విడుదల చేస్తామన్నారు. అయితే ఎన్నికల నియమావళి మాత్రం ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 272 వార్డులుండగా.. ఈ ఏడాది మొదట్లో వాటి సంఖ్యను 250కి తగ్గించారు. వీటిలో 42 స్థానాలను ఎస్సీలకు కేటాయించనున్నారు. మొత్తం సీట్లలో 50శాతం మహిళలకే ఇవ్వనున్నారు. మరోవైపు, జనవరి 1, 2022 నాటికి ఎంసీడీ పరిధిలో 1.46 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. గతంలో నిర్వహించినట్లుగానే ఈవీఎంలతోనే ఈ పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య లౌడ్‌స్పీకర్లతో ప్రచారం నిర్వహించడంపై నిషేధం విధించింది. ఒక్కో అభ్యర్థి ప్రచారం కోసం రూ.5.75 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య ఖర్చు చేసుకునేందుకు మాత్రమే అనుమతిచ్చింది.

మరోవైపు, భాజపా, ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ మధ్య త్రిముఖ పోరుకు సిద్ధమవుతున్న గుజరాత్‌లో డిసెంబరు 1, 5 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే, ఈ రెండు విడతల ఎన్నికల మధ్యలో డిసెంబరు 4న ఎంసీడీకి ఎన్నికలు నిర్వహించి, డిసెంబరు 7న ఓట్ల లెక్కింపు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడం గమనార్హం. దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలపై ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అర్వింద్‌ కేజ్రీవాల్‌ దిల్లీని ‘ఆప్‌ నిర్భర్‌’గా తయారు చేయాలనుకుంటే.. భాజపా మాత్రం ‘అత్మ నిర్భర్‌’ దిశగా నడిపిస్తోందని అన్నారు. దీనిపై కేజ్రీవాల్‌ ఘాటుగా స్పందించారు. ‘‘ఎంసీడీలో 15 ఏళ్లు అధికారంలో ఉండగా చేయలేనిది..మూడేళ్లలో చేస్తారా? ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి?’’ అంటూ చురకలంటించారు. 2007 నుంచి దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో భాజపానే విజయం సాధిస్తూ వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని