అఖిలేశ్‌.. మథురలో కృష్ణుడి ఆలయంపై మీ వైఖరేంటో చెప్పండి: కేశవ్‌ ప్రసాద్‌ సవాల్‌

మథురలో శ్రీకృష్ణుడి ఆలయం నిర్మాణం విషయంలో సమాజ్‌వాదీ పార్టీ వైఖరేంటో చెప్పాలని భాజపా సీనియర్‌ నేత, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అఖిలేశ్ యాదవ్‌కు సవాల్‌ విసిరారు. 

Published : 26 Nov 2023 16:51 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించడం సమాజ్‌వాదీ పార్టీకి ఇష్టంలేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య ఆరోపించారు. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో గుడి కట్టే అంశంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తన వైఖరేంటో చెప్పాలని సవాల్‌ విసిరారు. మైనారిటీల ఓట్ల కోసం సమాజ్‌వాదీ పార్టీ హిందువుల రక్తాన్ని చిందిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీకి శ్రీకృష్ణుడి వారసుల ఓట్లు కావాలి గానీ.. శ్రీకృష్ణ జన్మస్థలంలో ఆలయం మాత్రం వద్దు అంటూ ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో అఖిలేశ్‌ యాదవ్‌పై అజమ్‌ ఖాన్‌, అతడి వర్గం ఒత్తిడి ఉందని ఆరోపించారు. ఒకవేళ అలాంటిదేమీ లేకపోతే శ్రీకృష్ణ ఆలయం నిర్మాణంపై అఖిలేశ్‌ వైఖరేంటో చెప్పాలని సవాల్‌ చేశారు.  కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అఖిలేశ్‌ యాదవ్‌ను ఈ అంశంపై ప్రశ్నించడం ఇదే తొలిసారి కాదు. 2021లోనూ ఆయన ఇదే అంశంపై నిలదీశారు. ఆ తర్వాత 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అఖిలేశ్‌ మాట్లాడుతూ.. భగవాన్‌ శ్రీకృష్ణుడు తన కలలోకి వచ్చి.. తమ ప్రభుత్వమే ఏర్పడబోతోందని చెప్పారని వ్యాఖ్యానించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 

పేపర్ల లీక్‌తో యువత నష్టపోయారు: రాహుల్‌ గాంధీ

ఇటీవల శ్రీకృష్ణ భక్తురాలైన మీరాబాయి 525వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు.  మీరాబాయి స్మారక నాణేన్ని, స్టాంపును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయోధ్యలో శ్రీరాముడికి గొప్ప ఆలయం, కాశీవిశ్వనాథ్‌ ధామ్‌ కారిడార్‌ నిర్మాణం అంశాలను ప్రధాని ప్రస్తావించారు. అలాగే, మథుర, బ్రజ్‌ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి ఉండవన్నారు. బ్రజ్‌ ప్రాంతంలో మరింత దైవత్వంతో దేవుడు కనిపించే రోజు ఇంకెంతో దూరం లేదంటూ వ్యాఖ్యానించారు.  బ్రజ్ అభివృద్ధి కోసం ఉత్తర ప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ స్థాపించినందుకు ఎంతో సంతోషంగా ఉందని, భక్తుల సౌకర్యాల కోసం ఈ మండలి ఎంతగానో కృషిచేస్తుందని ప్రధాని మోదీ ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని