Rahul Gandhi: ‘న్యాయ యాత్ర’ రూట్‌ ఛేంజ్‌.. దీదీ వ్యాఖ్యలే కారణమా?

అస్సాం నుంచి పశ్చిమబెంగాల్‌లో ప్రవేశించిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ మార్గంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ముందుగా నిర్ణయించిన మార్గంలో కాకుండా త్వరత్వరగా యాత్ర ముగించి బిహార్‌లోకి వెళ్లేలా రూట్‌ మార్చారు.

Published : 25 Jan 2024 15:42 IST

కోల్‌కతా: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కొనసాగిస్తున్న ‘భారత్‌ జోడో న్యాయయాత్ర’ (Bharat Jodo Nyay Yatra) గురువారం అస్సాం నుంచి పశ్చిమబెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే, చివరి నిమిషంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందుగా ప్రతిపాదించినట్లు కాకుండా ఉత్తరాది జిల్లాల మీదుగా యాత్రను త్వరగా ముగించి బిహార్‌ (Bihar) రాష్ట్రంలోకి వెళ్లేలా మార్గాన్ని మార్చారు. వారం రోజుల్లోగా ‘న్యాయయాత్ర’ మళ్లీ బెంగాల్‌లోకి ప్రవేశిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. పార్టీకి మంచి పట్టున్న మాల్దా, ముర్షిదాబాద్‌ నియోజకవర్గాల్లో తరువాత యాత్ర కొనసాగుతుందని సమాచారం. సీపీఐ(ఎం)తో పాటు ఇండియా కూటమిలోను భాగస్వాములుగా ఉన్న ఇతర పార్టీల నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. కానీ, తృణమూల్‌ నాయకులు మాత్రం ఎక్కడా కనిపించలేదు. 

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ ఒంటరిగానే పోటీ చేస్తుందని బుధవారం ఆ పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే న్యాయయాత్ర మార్గంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై తాను ఒక ప్రతిపాదన చేశానని, కాంగ్రెస్‌ దానిని తోసిపుచ్చిందని, దీంతో సొంతంగానే పోటీకి దిగాలని నిర్ణయించుకున్నామని మమత మీడియాకు వెల్లడించారు. సీట్లపై రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్ని తోసిపుచ్చారు. ఈ అంశంపై కాంగ్రెస్‌లో ఏ ఒక్కరితోనూ తాను మాట్లాడలేదని స్పష్టంచేశారు. ఇకపై రాష్ట్రంలో ఆ పార్టీతో ఎలాంటి సంబంధం ఉండబోదన్నారు. జాతీయస్థాయిలో సంబంధాల పైనా పునరాలోచిస్తానని తెలిపారు.

విపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి భాజపాను ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ను దీదీ వ్యాఖ్యలు తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఆమ్‌ఆద్మీ కూడా పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ వెల్లడించారు. పంజాబ్‌ సహా హరియాణా, దిల్లీ, గోవా, గుజరాత్‌లలో సీట్ల సర్దుబాటుపై చర్చల్లో ప్రతిష్టంభన వేళ ఆయన ఈ ప్రకటన చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీతోనూ కాంగ్రెస్‌కు సరిగా పొసగడం లేదు. మహారాష్ట్రలో సీట్ల సర్దుబాటుపై ఆ రెండు పార్టీల మధ్య నెలకొన్న అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని