Telangana News: డీజిల్, పెట్రోల్ ధరలు ఎవరు పెంచి తగ్గించమన్నారు?: ఎర్రబెల్లి దయాకర్‌

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులు చేయడం లేదని.. పనిప్రదేశాల్లో పరిశీలన పేరుతో కావాలనే ఇబ్బందులు సృష్టిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి

Published : 24 May 2022 01:02 IST

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ బిల్లుల చెల్లింపులు చేయడం లేదని.. పనిప్రదేశాల్లో పరిశీలన పేరుతో కావాలనే ఇబ్బందులు సృష్టిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ఎర్రబెల్లి అధ్యక్షతన జరిగిన ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, సంబంధింత శాఖల అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల పురోగతిని సమీక్షించిన కౌన్సిల్ పలు తీర్మానాలు చేసింది. 

‘‘ఉపాధి హామీ పని దినాలను 16 కోట్లకు పెంచాలి. ఈ పథకాన్ని రైతులతో అనుసంధానించాలి. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. ఉపాధి హామీ అమలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్రంపై వివక్ష చూపుతోంది. గత మూడు నెలలుగా రూ.97 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. సర్పంచులు బాగా పనిచేసినందువల్లే గ్రామాలు మెరుగయ్యాయి. ఒకటి, రెండు నెలలు బిల్లులు ఆలస్యమైనందున తొందరపడొద్దు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటైన కొత్త గ్రామ పంచాయతీల పరిధిలో రోడ్లు, పంచాయతీ భవనాలను నిర్మిస్తాం. ఆదిమ గిరిజన తెగలు ఉన్న ప్రాంతాల్లో రూ.140 కోట్లతో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని’’ తీర్మానం చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి వెల్లడించారు.

కేసీఆర్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదు..

‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణకు ఏం చేశారని ఆయనను సన్మానించాలి. తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలో ఉన్న అంశాలను ఇప్పటివరకు అమలు చేయలేదు. ప్రధాని ముఖం ఎందుకు చూడాలి? గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఎవరు పెంచి తగ్గించమన్నారు? భాజపా నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. తెలంగాణ పర్యటనకు ప్రధాని వస్తున్నందునే కేసీఆర్ దిల్లీ వెళ్లారని భాజపా నేతలు అనవసర మాటలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదు. కులాల ప్రాతిపదికన ప్రజలు ఓట్లు వేయరు.. ఆదరించరు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు’’ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని