Kiran Kumar Reddy: ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే: కిరణ్‌కుమార్‌రెడ్డి

భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీనేత, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

Updated : 10 Jun 2023 17:59 IST

శ్రీకాళహస్తి: ‘ప్రజా జీవితంలో ఉండాలా? వద్దా?’ అని ఇన్ని రోజులు ఆలోచించానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఇటీవల భాజపాలో చేరిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించినట్లు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమే జరుగుతోందన్నారు.

‘‘నేను సీఎంగా ఉన్నప్పుడు రూ.7,400 కోట్లతో చిత్తూరు జిల్లాకు మంచినీటి పథకం ప్రణాళిక చేశాను. ఒక్క జిల్లా నీటి కోసమే అంత డబ్బు ఎలా ఖర్చు చేస్తారని ఆనాడు హరీశ్‌రావు నాతో గొడవపడ్డారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా, వైకాపా ప్రభుత్వాలు నేను ప్రారంభించిన మంచినీటి పథకాన్ని పక్కనపెట్టాయి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఇలా పనులు ఆపడం సరికాదు.’’ అని కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రాంతీయ పార్టీలు సొంత ఖజానా నింపుకుంటాయి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయబోవన్న ఆయన.. భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

అప్పుడు స్కామ్‌లు.. ఇప్పుడు స్కీమ్‌లు: పురందేశ్వరి

పాలకుడు తనకు తోచినట్లు చేయకూడదని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. ప్రజాహితాన్ని కాంక్షించి మాత్రమే పాలకుడు పని చేయాలని చెప్పారు.  ‘‘ నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసు. అధికారాన్ని సేవా మార్గంగా ఉపయోగించుకునే పార్టీ భాజపా. అంత్యోదయం, సభ్‌ కా వికాస్‌ అనేది భాజపా మూల సిద్ధాంతం. గతంలో రోజుకో స్కామ్‌ గురించి పత్రికల్లో చదివేవాళ్లం. ఇప్పుడు రోజుకో స్కీమ్‌ గురించి చదువుతున్నాం.’’ అని పురందేశ్వరి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని