ఆయుష్మాన్‌ భారత్‌లో సేవలు శూన్యం: కేజ్రీవాల్‌

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల కంటే దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే మెరుగ్గా ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ అన్నారు.

Published : 08 Jan 2020 01:36 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల కంటే దిల్లీలో ఆప్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే మెరుగ్గా ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. దిల్లీలో బుధవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉచిత వైద్యం అందించేందుకు ఆప్‌ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని ఆయన స్పష్టంచేశారు. ఎంతోమంది పేద రోగులు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొని చికిత్స పొందుతున్నారని, అవసరమైనవారికి శస్త్రచికిత్సలు సైతం చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో రోగులకు చికిత్సలు అందడంలేదన్నారు. ద్విచక్రవాహనం, మొబైల్‌ ఫోన్‌, ఫ్రిజ్‌, రూ.10వేల ఆదాయం ఉన్న వారెవరూ ఈ పథకానికి అర్హులు కాదని అంటున్నారని అన్నారు. అందుకే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు చేస్తున్నప్పటికీ అక్కడి నుంచి చాలామంది వైద్య సేవల కోసం దిల్లీకి వస్తున్నారని పేర్కొన్నారు. హరియాణాలోనూ అదే పరిస్థితి ఉందని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా ప్రజలకు కేవలం ఒక కార్డు మాత్రమే ఇస్తారని.. దాంతో మరెలాంటి లాభం లేదని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ కేంద్రంలోని భాజపా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని