చట్టం కాకుండానే ‘దిశ’ స్టేషన్లేంటి?:ఆదిరెడ్డి

సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరకర పోస్టుల పట్ల తక్షణం విచారణ చేసి దోషులను శిక్షించాలని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో...

Published : 11 Feb 2020 00:45 IST

రాజమహేంద్రవరం: సామాజిక మాధ్యమాల్లో తనపై అభ్యంతరకర పోస్టుల పట్ల తక్షణం విచారణ చేసి దోషులను శిక్షించాలని తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పార్టీ నేతలతో కలిసి రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాసనసభలో మద్యంపై తాను మాట్లాడిన అనంతరం సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ‘దిశ’ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

అయితే, కేంద్రం ఇంకా చట్టాన్ని ఆమోదించనందున ప్రస్తుతానికి ఇంకా ‘దిశ’ కేసును నమోదు చేయలేమని పోలీసులు చెప్పారన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టాలు పూర్తికాకుండానే ప్రత్యేక పోలీసు స్టేషన్లతో మహిళలను మభ్యపెట్టేలా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆదిరెడ్డి భవాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలా అయితే ‘దిశ’ పోలీసు స్టేషన్లలో సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందని మహిళా నేతలు ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని