Telangana Congress: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు.. బహిర్గతమైన కాంగ్రెస్‌ వర్గపోరు

ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జనగామ కాంగ్రెస్‌లోని వర్గపోరు బహిర్గతమైంది. ఓటర్ల జాబితా అంశంలో ఏర్పడిన గందరగోళం ఉద్రిక్తతకు దారి తీసింది. 

Updated : 17 Oct 2022 16:16 IST

హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా జనగామ కాంగ్రెస్‌లోని వర్గపోరు బహిర్గతమైంది. ఓటర్ల జాబితా అంశంలో ఏర్పడిన గందరగోళం ఉద్రిక్తతకు దారి తీసింది.  జనగామ నియోజకవర్గం నుంచి ఓట్లు వేసే నేతల జాబితా మార్పుపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా గందరగోళాన్ని నిరసిస్తూ పలువురు సీనియర్లు నిరసనకు దిగారు.

అసలేం జరిగిందంటే..

జనగామ నియోజకవర్గం నుంచి ఓటు వేసేందుకు పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్‌రెడ్డికి ఏఐసీసీ అవకాశం కల్పించి ఓటింగ్‌ కార్డు జారీ చేసింది. ఆ ఇద్దరు నేతలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాంధీభవన్‌లోని పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. చివరిక్షణంలో ఓటరు జాబితా నుంచి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి పేరు తొలగించి ఆయన స్థానంలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పేరును చేర్చారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆదివారం రాత్రి కొమ్మూరి పేరును ఓటరు జాబితాలో పెట్టారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డితో పాటు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కూడా ఓటు వేసేందుకు వచ్చారు. చివరి క్షణంలో శ్రీనివాస్‌రెడ్డి పేరును తొలగించడం పట్ల పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాలకు మాజీ మంత్రి జానారెడ్డి సర్దిచెప్పారు. ఈ గందరగోళ పరిస్థితులతో ప్రస్తుతానికి శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డిని ఓటు వేయకుండా నిలిపేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ నిరసనకు దిగారు. గాంధీభవన్‌ మెట్లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ గాంధీభవన్‌ మెట్లపై నిరసన తెలిపే దౌర్భాగ్య పరిస్థితి రావడం అవమానకరమన్నారు. 55 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ జెండా పట్టుకుని ఉంటున్న తమను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి 11 గంటలకు తనతో పాటు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డికి కార్డులు ఇచ్చారని.. 24 గంటలు గడవక ముందే మార్చేశారని మండిప్డడారు.

దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఇలాంటి వ్యవస్థ ఉండకూడదన్నారు. కార్డులు ఇచ్చి ఎందుకు అవమానించారని ప్రశ్నించారు. ఏ కారణంతో పేరు తొలగించారో కాంగ్రెస్‌ కార్యకర్తలకు వివరణ ఇవ్వాలన్నారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని