భారాసతో దేశంలో రైతురాజ్యం

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతు సంక్షేమ, వ్యవసాయ ప్రగతి పథకాలు దేశానికి ఆదర్శమని, వాటిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నదే ఆయన ఆకాంక్ష అని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Updated : 25 Jan 2023 06:30 IST

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
తమిళనాడు, కర్ణాటక, కేరళ రైతు నేతలతో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతు సంక్షేమ, వ్యవసాయ ప్రగతి పథకాలు దేశానికి ఆదర్శమని, వాటిని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్నదే ఆయన ఆకాంక్ష అని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇదేలక్ష్యంతో భారత్‌ రాష్ట్రసమితి పార్టీని స్థాపించారని తెలిపారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో దేశంలో సమగ్ర మార్పు సాధ్యమని వెల్లడించారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రైతు సంఘాల నేతలు జీఎస్‌ రవీందర్‌, రవిప్రకాశ్‌, అరివకాగన్‌, సౌందర్య పాండ్యన్‌, మురుగేశన్‌, బాలసుబ్రహ్మణ్యం, చంద్రన్‌, ధనుశేఖర్‌లతో మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కవిత భేటీ అయ్యారు. వారు మాట్లాడుతూ, రైతుబంధు, బీమా వంటి పథకాలతో అన్నదాతలకు కేసీఆర్‌ సంపూర్ణ భరోసా కల్పించడం వల్ల తెలంగాణలో సాగు సుసంపన్నంగా మారిందన్నారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించడం భారాస ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైందని చెప్పారు. కేసీఆర్‌ నిర్ణయాలు, చేపడుతున్న పనులు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, ఆయన పాలనలో తెలంగాణ రైతులు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు.  రైతుల సంక్షేమం కోసం కృషిచేస్తున్న ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కవిత వారిని స్వాగతిస్తూ.. భారాస ద్వారా రైతురాజ్యం వస్తుందని, జైజవాన్‌, జైకిసాన్‌ నినాదం ఫలవంతమవుతుందని అన్నారు. రైతు నేతలు తమ రాష్ట్రాల్లోని సమస్యలను కవిత దృష్టికి తీసుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని