Nara Lokesh: తెదేపా వస్తే అందరికీ సంక్షేమం
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు.
అభివృద్ధిని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన ఘనుడు జగన్‌రెడ్డి
ఏడాదిలో 2.30 లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైంది?
కుప్పం ‘యువగళం’ సభలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
అధికారంలోకి వస్తే తొలి ఏడాదే 2.30 లక్షల ఉద్యోగాలిస్తానన్న హామీ ఏమైంది? ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించడం లేదు. ఏడాదికి 6,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులన్నారు.. ఒక్కటీ భర్తీ చేయలేదు. మెగా డీఎస్సీ అన్నారు.. ఇచ్చింది సున్నా. ఈ బాధ తట్టుకోలేక 300 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రూప్-1, 2 ద్వారా 36 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. వీటన్నింటిని చూసి ఈ ప్రభుత్వానికి సిగ్గేయడం లేదా?
లోకేశ్
సైకిల్ పాలనకు సైకో పాలనకు చాలా తేడా ఉంటుంది. సైకిల్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడుల్లో రాష్ట్రానికి మొదటిస్థానం. సైకో పాలనలో అప్పులు, ఆత్మహత్యలు, గంజాయిలో మొదటి స్థానం.
బహిరంగ సభలో లోకేశ్
ఈనాడు, తిరుపతి - న్యూస్‌టుడే, కుప్పం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రకటించారు. మూడున్నరేళ్ల వైకాపా పాలనలో దగాపడిన యువత, రైతులు, ప్రజలను కలిసి వారి కష్టాలు వినేందుకే ‘యువగళం’ పాదయాత్రకు శ్రీకారం చుట్టానని వెెల్లడించారు. జగన్ మోహన్‌రెడ్డి అంటే జాదూరెడ్డి అని.. ఆయన ఇచ్చే జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు ఉండవని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ గడిచిన మూడేళ్ల ఎనిమిది నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధిలో 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు. ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా శుక్రవారం కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. తెదేపా అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు.
ఇదీ నా అర్హత
‘నాడు ఎన్టీఆర్‌ది చైతన్య రథమైతే.. చంద్రబాబుది ‘వస్తున్నా మీ కోసం’.. మనది ‘యువగళం’. ఈ పేరు ప్రకటించగానే వైకాపా నేతలకు దడ పుట్టింది. ఏ అర్హతతో పాదయాత్ర చేస్తున్నావని పది మంది మంత్రులు నాపై మాటల దాడికి దిగారు. రెండున్నరేళ్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశా. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 25 వేల కి.మీ.ల సీసీ రోడ్డు వేశాం. 25 లక్షల వీధిదీపాలు వేయించాం. పేదల ఇంటికి కుళాయిలు ఇచ్చేందుకు నిధులు కేటాయించాం. ఐటీ మంత్రిగా ఇక్కడ యువతకు 40 వేల ఉద్యోగాలు ఇప్పించాం. ఎలక్ట్రానిక్స్ రంగంలో మరో 40 వేల ఉద్యోగాలు తీసుకొచ్చాం. ఈ అర్హతతోనే నేను పాదయాత్ర చేస్తున్నా. రాష్ట్రానికి మంత్రులుగా మీరేం చేశారని ప్రశ్నిస్తున్నా. వీధుల్లో నృత్యాలు చేయిస్తే, కేసినోలు పెట్టి జూదం ఆడిస్తే పరిశ్రమలు రావు’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
పరిశ్రమలను వెళ్లగొట్టారు...
‘పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లులూ, హోలీటెక్, మెగా సీడ్ పార్కు వంటివి రాష్ట్రం నుంచి తరలిపోయాయి. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ చిత్తూరు జిల్లాలో అమరరాజా పరిశ్రమ ద్వారా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దాన్ని విస్తరిద్దామనుకుంటే జే ట్యాక్స్ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు. దీంతో 10 వేల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది తెదేపానే
‘అభివృద్ధి వికేంద్రీకరణను చేసి చూపించింది చంద్రబాబునాయుడు. అనంతపురానికి కియా మోటార్స్, బర్జర్ పెయింట్స్, జాకీ తీసుకొచ్చారు. చిత్తూరుకు ఫాక్స్‌కాన్, సెల్‌కాన్, డిక్సన్ తీసుకొచ్చారు. శ్రీసిటీ, హీరో మోటార్స్ వంటి పరిశ్రమలు తెచ్చారు. కర్నూలుకు సోలార్ పవర్ ప్లాంటు ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో మత్స్య, ఔషధ పరిశ్రమలు ఏర్పాటు చేయించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్, ఏషియన్ పెయింట్స్ తీసుకొచ్చారు. అయిదేళ్లలో 5.13 లక్షల ఉద్యోగాలు కల్పించారు. ఇందులో ఉత్తరాంధ్రకు 23%, రాయలసీమకు 31% వచ్చాయి. ఇదీ అభివృద్ధి వికేంద్రీకరణ అంటే’ అని లోకేశ్ వివరించారు. మూడు రాజధానులని ప్రకటించిన ఈ ముఖ్యమంత్రి అందులో ఎక్కడైనా ఒక్క ఇటుక వేశారా, ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా’ అని నిలదీశారు.
యువతకు ప్రత్యేక మేనిఫెస్టో
జగన్‌రెడ్డీ... ఎన్నికల ముందు ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాల వర్షాలు కురుస్తాయన్నావు. దిల్లీ మెడలు వంచుతానన్నావు. అధికారం అప్పగిస్తే... నువ్వే తల వంచి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కేసుల కోసం తాకట్టు పెట్టావు. అందువల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. త్వరలోనే యువతకు ప్రత్యేక మేనిఫెస్టోను తీసుకొస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు అన్నీ అందులో ప్రస్తావిస్తాం. ఏటా డీఎస్సీ ద్వారా ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని లోకేశ్ ప్రకటించారు.
మేం అధికారంలోకి వస్తే ఇసుక ఉచితం
చంద్రబాబు ఉన్నప్పుడు ఇసుక ఉచితంగా ఇచ్చామని.. ఇప్పుడు దాన్ని రూ.3 వేలకు అమ్ముతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ఇసుక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో దొరుకుతోంది. మనకు మాత్రం దొరకట్లేదన్నారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానం తీసుకొస్తామన్నారు. ‘నిరుపేదలకు ఎటువంటి షరతులు లేకుండా సంక్షేమం, పింఛన్లు, తెల్లకార్డులు అందిస్తాం. నాణ్యమైన, విత్తనాలు అందిస్తాం. రాయలసీమకు ఉచితంగా డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తాం. సాగునీటి ప్రాజెక్టులను పునర్‌నిర్మించి కృష్ణా, గోదావరి నీళ్లు అందిస్తాం. పంటలకు గిట్టుబాటు ధర ఇస్తాం. కౌలు రైతులను ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చారు.
ఈ ప్రభుత్వానిది సామాజిక అన్యాయం
‘ఈ ప్రభుత్వ హయాంలో సామాజిక అన్యాయం జరుగుతోంది. తాడేపల్లి ప్యాలెస్‌లో వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి అనే నలుగురు ఉంటారు. ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు సమయం కావాలని అదే ప్యాలెస్ గేటు వద్ద బీసీ నేతలు చేతులు కట్టుకుని నిల్చుంటారు. నాడు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తే నేడు 24 శాతానికి తగ్గించారు. ఇదేనా మీరు చేస్తున్న సామాజిక న్యాయం? మేం తెచ్చిన ఆదరణ పథకాన్ని మూలనపడేశారు. 56 బీసీ కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి రాలేదు. కనీసం వాటి ఛైర్మన్లకు కూర్చోవడానికి కుర్చీలైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. ‘దళితులు, మైనారిటీలను చంపి శవాలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ఓ ఎమ్మెల్సీ తన డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసినా ఆయనపై చర్యలు లేవు. విద్యుత్తు ఛార్జీలు పెంచి ఆ తర్వాత ఆరు లక్షల పింఛన్లు తొలగించారు. రైతులను చంపేందుకు జగన్ ప్రత్యేక లైసెన్స్ ఇచ్చినట్లున్నారు’ అని మండిపడ్డారు.
వడ్డీతో సహా చెల్లిస్తా...
‘ప్రపంచ బ్యాంకులో పని చేశా. నాకు హెరిటేజ్ వంటి సంస్థ ఉంది. పేదరికం లేని రాష్ట్రం చూసేందుకే ఈ పాదయాత్ర. సైకోకు భయపడే బ్యాచ్ కాదు. తోలు తీసే బ్యాచ్. కుప్పం ఎంతో ప్రశాంతమైన ప్రాంతం. ఏనాడూ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందిపెట్టలేదు. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు రాముడు.. నేను మాత్రం వైకాపా వాళ్లకు మూర్ఖుణ్నని హెచ్చరిస్తున్నా. మీరు చేసిందానికి.. వడ్డీ, చక్రవడ్డీతో చెల్లిస్తా. కుప్పంలోని అక్రమ మైనింగ్‌తో సంపాదించిన ప్రతి రూపాయీ కక్కించి.. ఇక్కడి పేదలకే ఖర్చు చేస్తా’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
వారాహీ ఆగదు..
‘ఎవరూ ప్రజా సమస్యలపై పోరాడకూడదు. కలిసికట్టుగా ఉండకూడదనే దురుద్దేశంతోనే జీవో నంబరు 1 తెచ్చారు. ప్రజల తరఫున పోరాడుతున్న పవన్‌కల్యాణ్ బయట అడుగుపెట్టకూడదట. ఆయన పర్యటనల కోసం తయారుచేసుకున్న వారాహికి ఆంధ్ర రాష్ట్రంలో అనుమతులు ఇవ్వరట. వారాహి ఆగదు.. యువగళమూ ఆగదు. యువత తరఫున పోరాటాన్ని ఏశక్తీ ఆపలేదు. అడ్డొస్తే తొక్కుకెళ్తాం. నాలో మానవత్వంతోపాటు మంచితనం ఉంది.. పోరాడే దమ్మూ ఉంది’ అని యువనేత పేర్కొన్నారు. 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించవద్దని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
అట్టహాసంగా యువగళం సభ
బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నేతలు మధ్యాహ్నానికి బహిరంగ సభాస్థలికి చేరుకున్నారు. సభకు లోకేశ్ రాక ముందు.. ఆ తర్వాత ప్రసంగించిన నాయకులు తెదేపా శ్రేణులతో పాటు అభిమానుల్లో సమరోత్సాహాన్ని నింపారు. లోకేశ్ సహా ముఖ్య నేతల ప్రసంగాలకు పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి చక్కటి స్పందన లభించింది.
తూటా లేని తుపాకీ
‘ఎన్నికల ముందు... ఆడబిడ్డలకు ఇబ్బంది వస్తే గన్ తూటా కంటే ముందు జగన్ వస్తాడన్నారు. ఇప్పుడు అర్థమైంది. అది తూటా లేని తుపాకీ. పులివెందులలో నాగమ్మ అనే దళిత మహిళను, ఎమ్మిగనూరులో హజీరా అనే ముస్లిం సోదరిని చంపేస్తే న్యాయం జరగలేదు. దాదాపు 900 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే స్పందించలేదు. మహిళలపై నేరాలకు పాల్పడేవారికి 21 రోజుల్లోనే ఉరి వేస్తా.. దానికోసం దిశ చట్టం తీసుకొచ్చానని శాసనసభలో ప్రకటించారు. మరి ఈ కేసుల్లో ఒక్కరికైనా 21 రోజుల్లో శిక్ష పడిందా?’ అని లోకేశ్ నిలదీశారు.
పన్నులను ప్రక్షాళన చేస్తాం...
‘ఈ జాదూరెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ డబ్బులు లాక్కుంటున్నారు. విద్యుత్తు, గ్యాస్, డీజిల్, పెట్రోల్, చింతపండు, ఉప్పు, నూనె ధరలు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను, చెత్తపన్నులను పెంచేశారు. మరో ఏడాదిలో చంద్రబాబు వస్తారు.. పన్నులను ప్రక్షాళన చేసి, నిత్యావసరాల ధరలు తగ్గిస్తారు’ అని లోకేశ్ భరోసా ఇచ్చారు. ‘మద్యపాన నిషేధం అమలు కాలేదు. కల్తీ మద్యంతో జేబులు నింపుకొంటున్నారు. రైతురాజ్యం అని చెప్పి నేడు రైతుల్లేని రాజ్యం చేశారు. రైతు భరోసా ఒక మాయ. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు దొరకట్లేదు. తుంపర సేద్యం పరికరాలు రాయితీపై ఇవ్వడం ఆపేశారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనడానికి కొర్రీలేస్తారు.. కొన్నాకా డబ్బులివ్వరు. ఇప్పుడు మోటార్లకు మీటర్లు బిగించి రైతులకు ఉరితాళ్లు కడుతున్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది’ అని మండిపడ్డారు.
వినూత్న సంఘీభావం
‘యువగళం’ పాదయాత్ర విజయవంతం కావాలంటూ విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెదేపా నాయకులు శుక్రవారం కోటలోని దర్బార్ మహల్ ఆవరణలో యువగళం అక్షరమాలను రంగులతో తీర్చిదిద్దారు.పసుపు బెలూన్లు ఎగురవేసి సంఘీభావం తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Afghanistan: ఉగ్రవాదం నుంచి ప్రభుత్వాధికారులుగా.. తాలిబన్లలోనూ క్వైట్ క్విట్టింగ్!
-
India News
Manish Sisodia: జైలు నుంచి దిల్లీ విద్యార్థులకు సిసోదియా ప్రత్యేక సందేశం!
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
Movies News
Pawan Kalyan: పవన్ కల్యాణ్ కోసం మరో యంగ్ డైరెక్టర్.. త్రివిక్రమ్ కథతో
-
Politics News
Congress Vs SP: కూటమిపై కొట్లాట..కాంగ్రెస్ వద్దు.. మేం లేకుండా ఎలా?
-
World News
Kailasa: ‘కైలాస.. సరిహద్దులు లేని దేశం..!’