Kotamreddy: రాష్ట్ర ప్రభుత్వం షేక్‌ అవుతుంది

‘నా ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలను బయటపెట్టానంటే రాష్ట్ర ప్రభుత్వం షేక్‌ అవుతుంది.. ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల ఉద్యోగాలూ పోతాయ్‌.. కేంద్ర ప్రభుత్వమే విచారణకు దిగుతుంది’ అని నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published : 01 Feb 2023 06:26 IST

ఫోన్‌ట్యాపింగ్‌ ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్‌ల ఉద్యోగాలు పోతాయ్‌
2024లో తెదేపా నుంచే పోటీ చేస్తా
వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘నా ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలను బయటపెట్టానంటే రాష్ట్ర ప్రభుత్వం షేక్‌ అవుతుంది.. ఇద్దరు ఐపీఎస్‌ అధికారుల ఉద్యోగాలూ పోతాయ్‌.. కేంద్ర ప్రభుత్వమే విచారణకు దిగుతుంది’ అని నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వమే తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తుందన్న విషయాన్ని రెండు రోజుల క్రితం బయటపెట్టిన ఆయన.. ఇక వైకాపాలో ఇమడలేనంటున్నారు. తన కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో ఒకటి మంగళవారం బయటకొచ్చింది. అందులో.. ‘నా ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతోంది.. దీనికి సంబంధించిన సాక్ష్యాన్ని మీరంతా చూడాల్సిన అవసరం ఉంది. వీటిని ఎందుకు బయట పెట్టలేదని మీరు అనొచ్చు.. ఎన్నికల్లో పోటీకి వైకాపా నాకు రెండు సార్లు అవకాశమిచ్చింది. ఇప్పుడు ఆ పార్టీతో వద్దనుకుంటున్నాం. నమ్మకం లేని పార్టీలో ఎక్కువ రోజులు ఉండలేం. మీ అందరి సహకారంతో 2024లో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తా’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు ఆడియోలో ఉంది.

హైరానా పడుతున్న వైకాపా పెద్దలు

కోటంరెడ్డి వ్యవహారం రచ్చకెక్కడంతో వైకాపా పెద్దలు హైరానా పడుతున్నారు. ఇప్పటికే వైకాపా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనతో ఫోన్‌లో మాట్లాడే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే స్పందించలేదని తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేతో మాట్లాడి సర్దుబాటు మాటలు చెప్పినట్లు సమాచారం. వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం నెల్లూరు వెళ్లారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌, తదితర వైకాపా నాయకులతో భేటీ అయ్యారు. ఆ సమావేశానికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆహ్వానించగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఉదయం టీకప్పులో తుపాను.. సాయంత్రానికి మారిపోయింది

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మంగళవారం ఉదయం విలేకరులు ప్రశ్నించగా.. ‘శ్రీధర్‌ రెడ్డి పార్టీకి పునాది పడ్డప్పటి నుంచీ కష్టపడి పని చేస్తున్నారు..ఆయనను పార్టీకి దూరం చేయాలని కొంతమంది కలలు కంటున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌లేమీ జరగవు. ఇదంతా టీ కప్పులో తుపానే. అన్నీ సర్దుకుంటాయి’ అని మంత్రి స్పందించారు. అయితే సాయంత్రానికి బాలినేని స్పందన మరోలా ఉంది.

చంద్రబాబుతో మాట్లాడుకున్నాకనే.. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు: బాలినేని

‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో నాకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి..ఎక్కడా ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదు. అతను ఫోన్‌లో మాట్లాడింది రికార్డు చేసి ఆయన మనుషులతోనే బయట పెట్టించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమైతే నాకుగానీ, సీఎం దృష్టికిగానీ తీసుకురావాలి. వచ్చే ఎన్నికల్లో తెదేపా తరఫున పోటీ చేస్తానని ఆయన చెప్పినట్లు బయటకు వచ్చిన వీడియోలో ఉంది. చంద్రబాబుతో మాట్లాడుకున్నారు కాబట్టే.. ఇలా ఫోన్‌ ట్యాపింగ్‌ అనే మాటలను కోటంరెడ్డి చెబుతున్నారు’ అని వైకాపా నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి త్వరలోనే వైకాపా బాధ్యుడిని నియమిస్తామని ప్రకటించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ను ఆధారాలతో నిరూపిస్తా: శ్రీధర్‌రెడ్డి

‘నా ఫోన్‌ను ట్యాప్‌ చేసిన మాట వాస్తవం. బుధవారం విలేకరుల సమావేశం పెట్టి ఆధారాలతో నిరూపిస్తా’ అని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరగలేదని, ఏదైనా ఉంటే ఆధారాలతో చూపాలని బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.


ఫ్లెక్సీలు మారాయి..

నెల్లూరు గ్రామీణ వైకాపా కార్యాలయం ముందు మంగళవారం మధ్యాహ్నం వరకూ కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డిని వైకాపా సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఉంది. అందులో కోటంరెడ్డి సోదరులు సీఎం జగన్‌ను సన్మానిస్తున్న చిత్రం ఉంది. సాయంత్రానికి ఫ్లెక్సీ మారిపోయింది. ‘జయహో కోటంరెడ్డి బ్రదర్స్‌.. పార్టీ ఏదైనా.. జెండా ఏదైనా మీతోనే మా ప్రయాణం’ అని ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో శ్రీధర్‌రెడ్డి, గిరిధర్‌రెడ్డిల ఫొటోలు మాత్రమే ఉండటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని