Abhishek Sharma - Travis Head: భారత క్రికెట్‌లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్

ఐపీఎల్ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ గెలిచింది.

Updated : 09 May 2024 11:51 IST

ఇంటర్నెట్ డెస్క్: సొంతమైదానం ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ చెలరేగిపోయింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన ఆ జట్టు లఖ్‌నవూను చిత్తు చేసింది. 166 పరుగుల లక్ష్య ఛేదనను సన్‌రైజర్స్ వికెట్‌ నష్టపోకుండా 9.4 ఓవర్లలోనే పూర్తి చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (75*: 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు), ట్రావిస్‌ హెడ్ (89*: 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) అదరగొట్టారు. అభిషేక్‌తో కలిసి తొలి వికెట్‌కు (167) రికార్డు భాగస్వామ్యం నిర్మించడంపై హెడ్ ఆనందం వ్యక్తం చేశాడు. 

‘‘కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేయడం సరదాగా అనిపించింది. నేను, అభిషేక్ ఇలాంటి భాగస్వామ్యాలను ఇప్పటికే ఈ సీజన్‌లో కొన్నిసార్లు చేశాం. బంతిని పరిశీలించి బలంగా బాది స్టాండ్స్‌లో పడేయడంపైనే దృష్టిసారించాం. స్పిన్‌ను ఎదుర్కోవడంపై వర్కౌట్‌ చేశా. కరీబియన్‌ పిచ్‌లపై ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో 360 డిగ్రీల్లో షాట్లు కొట్టాలి. గతేడాదిగా నేను నిర్భయంగా ఆడటంపైనే దృష్టిపెట్టా. ఆస్ట్రేలియా జట్టు ఏ పాత్ర పోషించమంటే దానికి సిద్ధమవుతున్నా. నా సన్నద్ధతలో అప్పటికీ.. ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు. అభిషేక్‌తో కలిసి ఆడటం భలే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇద్దరం దూకుడుగా ఆడేందుకు ఇష్టపడతాం. అతడు నెట్స్‌లో ఎంత కష్టపడతాడో నాకు తెలుసు. భారత క్రికెట్‌కు అద్భుతమైన ఆటగాడు దొరికినట్లే. స్పిన్‌, పేస్‌ను అలవోకగా ఎదుర్కోగలడు. గత రెండు మ్యాచుల్లో మా నుంచి మంచి భాగస్వామ్యాలు నమోదు కాలేదు. నెట్‌ రన్‌రేట్‌ గురించి మేం పెద్దగా ఆలోచించలేదు. టైమౌట్‌ సమయంలో మాత్రం మా వాళ్లు వచ్చి కాస్త త్వరగా ముగించాలని చెప్పారు. గత మ్యాచులో మేం ఓడిపోవడంతో ప్రతి గేమ్‌ కీలకంగా మారింది. హైదరాబాద్‌కు ఆడిన తొలి సీజన్‌లోనే.. డేవిడ్‌ వార్నర్‌ కంటే ఎక్కువ పరుగులు చేసినందుకు ఆనందంగా ఉంది. తర్వాత మ్యాచ్‌లోనూ ఇదే దూకుడు కొనసాగించి విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం’’ అని హెడ్ తెలిపాడు.

టీమ్‌ మేనేజ్‌మెంట్ వల్లే..: అభిషేక్

‘‘ఇలాంటి మెగా టోర్నీలో ఇలాంటి స్ట్రైక్‌రేట్‌తో భారీగా పరుగులు చేస్తానని అనుకోలేదు. ఇదంతా టీమ్‌ మేనేజ్‌మెంట్ వల్లే సాధ్యమైంది. ఎలా ఆడినా మద్దతుగా నిలుస్తామని ఇచ్చిన ధైర్యంతోనే దూకుడుగా ఆడేస్తున్నా. ఈ మ్యాచ్‌ను త్వరగా ముగించడంలో ట్రావిస్‌ హెడ్‌దే కీలక పాత్ర. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడి చేయడం ప్రారంభించాక నేను కూడా దూకుడు మొదలుపెట్టా. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సమయంలో మా బౌలర్లు  పిచ్‌ మారుతుందని చెప్పారు. కానీ, నాతోపాటు హెడ్‌కు పెద్దగా మార్పు కనిపించలేదు. టోర్నీకి ముందు పడిన కష్టానికి ఇది ప్రతిఫలం. ఈ సందర్భంగా యువరాజ్‌ సింగ్, బ్రియాన్‌ లారా, మా నాన్నకు ధన్యవాదాలు చెబుతున్నా’’ అని అభిషేక్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని