‘జోడో యాత్ర’తో కాంగ్రెస్‌ జైత్రయాత్ర చేస్తుందా..?

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర తమ పార్టీకి బూస్టర్‌ డోస్‌ వంటిదని హస్తం పార్టీ అభివర్ణించింది.

Updated : 08 Feb 2023 05:55 IST

హస్తం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిన రాహుల్‌ యాత్ర
అధికారాన్ని కట్టబెడుతుందా అన్న విషయంలో సందేహాలు
ఈ ఏడాది ఎన్నికల బరిలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ
వేధిస్తున్న వర్గ, ఆధిపత్య పోరులు

దిల్లీ, జైపుర్‌, భోపాల్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర తమ పార్టీకి బూస్టర్‌ డోస్‌ వంటిదని హస్తం పార్టీ అభివర్ణించింది. అయితే ఇది శాసనసభ ఎన్నికలను ఎదుర్కోబోతున్న ప్రధాన రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణల్లో పార్టీకి ఎంత వరకూ ఉపకరిస్తుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మరోపక్క జోడో యాత్ర రాజకీయపరమైనది కాదని, ఆలోచనల యుద్ధభూమిని సంగ్రహించే లక్ష్యంతో చేపట్టిన సైద్ధాంతిక యాత్ర అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ పునరుద్ఘాటించారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి ఎంత వరకూ ఉపకరిస్తుంది అనేది ఈ యాత్రకు అసలైన పరీక్ష అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఈ ఏడాది శాసనసభ ఎన్నికలను ఎదుర్కొంటున్న తొమ్మిది రాష్ట్రాల్లోని కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణల మీదుగా జోడో యాత్ర సాగింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా సాగిన భారత్‌ జోడో యాత్ర ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందనడంలో సందేహం లేదు. అయితే ఈ పరిస్థితి ఎన్నికల్లో ఎంత వరకూ ఉపకరిస్తుందన్నది ఆయా రాష్ట్రాల్లోని పార్టీ శాఖలు కార్యకర్తల్లోని జోష్‌ను కొనసాగించడంపై అధారపడి ఉండనుంది. అంతేకాకుండా రాజస్థాన్‌, కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ సంస్థాగతంగా ఏకతాటిపై నిలబడటం ముఖ్యం. కాంగ్రెస్‌లో వర్గ పోరు, ముఠాల సంస్కృతి సాధారణమనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కర్ణాటక, మధ్యప్రదేశ్‌ల్లో యాత్ర వల్ల పార్టీకి కొన్ని ప్రయోజనాలు కనిపిస్తుండగా రాజస్థాన్‌ వద్దకు వచ్చే సరికి ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌, ఆయన ప్రత్యర్థి సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య వైరం దీన్ని బలహీనపరుస్తోంది. ఈ రాష్ట్రంలో డిసెంబరు 21న భారత్‌ జోడో యాత్ర ముగిసింది. యాత్ర సమయంలో గహ్లోత్‌, పైలట్‌ వర్గాలు కలహించుకోకపోవడం పార్టీకి పెద్ద ఉపశమనం కలిగించింది. ఇదే పరిస్థితి శాసనసభ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, కర్ణాటకల్లోనూ నెలకొంది. ఈ రాష్ట్రాల్లో పార్టీ నేతల వ్యక్తిగత ఆశయాలు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై జైరాం రమేశ్‌ ఇటీవల మాట్లాడుతూ వ్యక్తిగత ఆశయాలు కాంగ్రెస్‌కు శాపంగా మారాయని వాపోయారు. జోడో యాత్ర చాటిన సమష్టి ప్రయోజనం, సంఘీభావం రాజస్థాన్‌తో సహా ఆయా రాష్ట్రాలకు ఆవశ్యకమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి పీఠం ఆశావహులైన మాజీ సీఎం సిద్ధరామయ్య, పార్టీ సీనియర్‌ నేత డి.కె.శివకుమార్‌ మధ్య అంతరాలున్నప్పటికీ యాత్ర నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్‌కు పరిస్థితులు అంత్యంత అనుకూలంగా మారాయి. పీసీసీ ‘ప్రజా ధ్వని యాత్ర’ పేరిట చేపట్టిన రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు శివకుమార్‌, సిద్ధరామయ్య సంయుక్తంగా నేతృత్వం వహిస్తుండటం సానుకూలాంశం.


ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల్లో విజయానికి రాజకీయ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ శాఖలో ఉత్సాహాన్ని కొనసాగించాల్సి ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు. జోడోయాత్ర రాష్ట్రంలో ఓ ప్రాంతంలోనే సాగిందని.. దాని ప్రభావం మిగిలిన ప్రాంతాలపై అంతగా లేదని..ఈ నేపథ్యంలో వరుస కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. జోడో యాత్ర పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన మాట వాస్తవమేనని, అయితే దాని ప్రభావం ఓటర్లపై ఎంతమేరకు అన్నది ఎన్నికల సందర్భంగానే కనిపిస్తుందని సీనియర్‌ జర్నలిస్టు, రచయిత రషీద్‌ కిద్వాయి పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో భారత్‌ జోడో యాత్ర అడుగుపెట్టలేదు. అయితే ఇక్కడి నేతలు, కార్యకర్తలు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన యాత్రలో పాల్గొన్నారు. దీని ప్రభావం ప్రార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని పరోక్షంగా పెంచింది. ఈ క్రమంలో ఇదే జోరును కొనసాగించేందుకు ‘హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌’ యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జోడో యాత్ర వాస్తవ ప్రభావాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినప్పటికీ భాజపాపై ఆధిక్యం సాధించడానికి, రెండో దఫా అధికారాన్ని సాధించేందుకు.. పార్టీ శ్రేణుల్లో యాత్ర కొత్త ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకుడు, సీనియర్‌ పాత్రికేయుడు ఆర్‌.కృష్ణదాస్‌ పేర్కొన్నారు.


కాంగ్రెస్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారత్‌ జోడో యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అయితే ఇది ఎన్నికల్లో ప్రతిఫలించాల్సి ఉంది. దేశంలో ప్రతి కుటుంబానికి పార్టీ సందేశాన్ని చేరువ చేసేందుకు కాంగ్రెస్‌ చేపడుతున్న ‘హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌’ యాత్ర విజయవంతం కావడంపైనా, పార్టీలోని వర్గపోరు సద్దుమణగడంపైనా ఆ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో ‘జోడో యాత్ర’ ప్రతిఫలం కాంగ్రెస్‌కు దక్కేది లేనిది కాలమే నిర్ణయించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని