సంక్షిప్త వార్తలు (4)

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైకాపా పరిశీలకుడిగా కొడవలూరి ధనుంజయరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ నియమించారు.

Updated : 08 Feb 2023 06:36 IST

ఉదయగిరి పరిశీలకుడిగా మరో ధనుంజయరెడ్డి
ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి పంతం నెగ్గిందా?

ఈనాడు, అమరావతి: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైకాపా పరిశీలకుడిగా కొడవలూరి ధనుంజయరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మెట్టుకూరు ధనుంజయరెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ నియమించారు. కొడవలూరి ధనుంజయరెడ్డి నియామకాన్ని స్థానిక వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. వీరిరువురి మధ్య వర్గపోరు చోటుచేసుకుంది. ‘వైఎస్సార్‌ కుటుంబానికి నేను విధేయుడిని. నాకు వ్యతిరేకంగా ఉన్నవారు పెత్తనం చలాయించాలనుకుంటే కుదరదు. ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తాన’ంటూ వరికుంటపాడు మండలంలో ఇటీవల ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో మేకపాటి హెచ్చరించారు. తర్వాత వారం రోజుల్లోనే పరిశీలకుడు మారిపోవడం గమనార్హం. కొత్తగా నియమితులైన మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన నాయకుడు.


వైకాపా సమన్వయకర్త ఎదుటే మైలవరం నేతల వాగ్వాదం

గోరంట్ల(గుంటూరు), న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలో అధికార పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ఎదుటే కొందరు నాయకులు వాదులాటకు దిగారు. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల హంగామా కారణంగా మంగళవారం గుంటూరు బృందావన గార్డెన్స్‌లోని ప్రాంతీయ కార్యాలయం వద్ద వాతావరణం వేడెక్కింది. ఇటీవల ఎమ్మెల్యేను దూషించిన వ్యక్తిని పార్టీ నుంచి తప్పించాలంటూ ఆయన అనుకూలవర్గం నాయకులు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌ను కోరారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నల్లమోతు మధును వెంటనే తొలగించాలని నినదించారు. నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరువర్గాల వారికి సమన్వయకర్త సర్ది చెప్పి అందరినీ కూర్చోబెట్టి సమస్యలను విన్నారు.


విశాఖ మెట్రోపై విజయసాయిరెడ్డి అబద్ధాలు: జీవీఎల్‌

ఈనాడు, దిల్లీ:  విశాఖపట్నం మెట్రోకు రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపకుండానే.. కేంద్రం సాయం చేయట్లేదని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ సాక్షిగా అబద్ధాలు చెప్పారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదనలు రాలేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్‌కిశోర్‌ ఈ నెల 2న లోక్‌సభలో వైకాపా ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారని గుర్తుచేస్తూ.. దాని ప్రతులను ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. వైకాపా తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి భాజపాపై నిందలు మోపడం మానుకోవాలని హితవుపలికారు.


అంగన్‌వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి
తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి అధ్యక్షురాలు సునీత

ఈనాడు-అమరావతి: అంగన్‌వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే అమలు చేయాలని తెదేపా అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండు చేశారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘అంగన్‌వాడీ సిబ్బంది కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు  రూ.4వేలు ఉన్న జీతాన్ని రూ.7వేలకు పెంచారు. తర్వాత రూ.10,500 చేశారు. అన్ని ప్రభుత్వ పథకాలను వారికి వర్తింపజేశారు. జగన్‌రెడ్డి కొత్తగా ఆదాయ పరిమితి నిబంధన తెచ్చి వారిని పథకాలకు దూరం చేశారు...’ అని పేర్కొన్నారు. ‘అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు సరైన ఆహారం కూడా అందించడం లేదు. కాలపరిమితి ముగిసిన పాలు, మురిగిపోయిన కోడిగుడ్లు, ముక్కిపోయిన బియ్యం, చిక్కీలతో పిల్లల కడుపు మాడుస్తున్నారు. సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా.. మెనూ ఛార్జీలు పెంచకుండా పిల్లలకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని హుకుం జారీ చేస్తే సరిపోతుందా?’ అని ఆచంట సునీత నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని