త్రిపుర సీఎంగా సాహా ప్రమాణం

త్రిపుర ముఖ్యమంత్రిగా 70ఏళ్ల మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాల సమక్షంలో బుధవారమిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేత గవర్నరు ఎస్‌.ఎన్‌.ఆర్య ప్రమాణం చేయించారు.

Published : 09 Mar 2023 03:58 IST

మోదీ, అమిత్‌ షా హాజరు

అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రిగా 70ఏళ్ల మాణిక్‌ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాల సమక్షంలో బుధవారమిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన చేత గవర్నరు ఎస్‌.ఎన్‌.ఆర్య ప్రమాణం చేయించారు. మరో 8 మంది మంత్రులూ సీఎంతోపాటు ప్రమాణ స్వీకారం చేశారు. చివరిదాకా ముఖ్యమంత్రి రేసులో నిలిచిన ప్రతిమా భౌమిక్‌కు మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు. ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉండటంతో మలి విడతలో ఆమెకు అవకాశం ఇస్తారా? లేదా? అనేది తేలాలి. ప్రమాణం చేసిన వారిలో ఐపీటీఎఫ్‌కు చెందిన ఒకరు ఉన్నారు. మిగిలిన వారంతా భాజపాకు చెందిన ఎమ్మెల్యేలే. ఎన్నికల అనంతర హింసను నిరసిస్తూ కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

టిప్రాసా సమస్యకు త్వరలో పరిష్కారం

టిప్రాసా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండు చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసి 13 స్థానాలను గెలుచుకున్న టిప్రా మోథా నేతలతో బుధవారం అగర్తలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు ప్రద్యోత్‌ కిషోర్‌ దేబ్‌ వర్మతోపాటు ఇతర నేతలు, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, త్రిపుర ముఖ్యమంత్రి సాహా ఇందులో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని దేబ్‌ వర్మ కోరుతున్నా ఇప్పటికే చిన్న రాష్ట్రమైన త్రిపురను విభజించేందుకు భాజపా సుముఖంగా లేదు. త్రిపుర ట్రైబల్‌ అటానమస్‌ కౌన్సిల్‌కు మరిన్ని శాసన, ఆర్థిక, కార్యనిర్వాహక అధికారాలను అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దేబ్‌ వర్మ ఫేస్‌బుక్‌లో సమావేశ సమాచారాన్ని పంచుకున్నారు. ఈ సమస్యకు నిర్ణీత సమయంలో ‘రాజ్యాంగ పరిష్కారం’ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నందుకు అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని