వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.

Published : 26 Apr 2024 03:27 IST

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది. మే 2వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. అదే నెల 27న పోలింగ్‌ జరుగుతుంది. అయితే ఫలితం కోసం మాత్రం లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాతి రోజైన జూన్‌ 5 వరకు వేచిఉండాల్సిందే. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి గతేడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి డిసెంబరు 9న రాజీనామా చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. రాజీనామా చేసినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాలి. నియోజకవర్గం పరిధిలోని 12 జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, అయిదుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. షెడ్యూలు ప్రకటన నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణం అమలులోకి వస్తుందని ఈసీఐ ప్రకటించింది.


ఎన్నికల షెడ్యూలు ఇలా..

మే 2: నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
మే 9: నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
మే 13: ఉపసంహరణకు గడువు
మే 27: పోలింగ్‌ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
జూన్‌ 5: ఓట్ల లెక్కింపు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని