ప్రశ్నపత్రాల లీకేజీపై ప్రభుత్వానిది మొద్దునిద్ర

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని భాజపా ఆరోపించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ తమిళిసైని కోరింది.

Published : 19 Mar 2023 03:38 IST

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
గవర్నర్‌ను కోరిన భాజపా బృందం

ఈనాడు, హైదరాబాద్‌, ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని భాజపా ఆరోపించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ తమిళిసైని కోరింది. ఈ మేరకు శనివారం పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ నేతృత్వంలో నాయకుల బృందం గవర్నర్‌ని కలిసి వినతిపత్రం అందజేసింది. లీకేజీ వ్యవహారంలో జోక్యం చేసుకుని యువతలో విశ్వాసం పెంచే చర్యలు తీసుకోవడంతో పాటు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరింది. లీకేజీకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ రాజీనామా చేయాలని వినతిపత్రంలో డిమాండ్‌ చేసింది. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఈటల రాజేందర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. జరిగిన నాలుగు, జరగబోయే రెండు పరీక్షలు మొత్తం ఆరు పేపర్లు లీక్‌ కావడం సీఎం కేసీఆర్‌ పాలన తీరుకు అద్దం పడుతోందని విమర్శించారు. పేపర్ల లీకేజీ ఉద్దేశపూర్వకమా? యాదృచ్ఛికమా? చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పరీక్షలు రద్దు చేసి తప్పించుకోవద్దన్నారు. భాజపా అండగా ఉంటుందని, అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. పరీక్షల నిర్వహణలో విఫలమైన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు సభ్యులంతా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఒక్కో విద్యార్థికి రూ.లక్ష సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ.. వ్యవస్థలో లోపంతోనే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయని చెప్పారు. ఉద్యోగులకే సరిగా జీతాలివ్వని ప్రభుత్వం.. కొత్త నియామకాలు జరిగితే ఇబ్బందని భావిస్తోందన్నారు. గవర్నర్‌ని కలిసిన బృందంలో మర్రి శశిధర్‌రెడ్డి, రాంచందర్‌రావు, ఎస్‌.కుమార్‌, రవీందర్‌రెడ్డి, చంద్రవదన్‌, విఠల్‌, కృష్ణప్రసాద్‌ ఉన్నారు. భాజపా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లేట్ల ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని