‘సావర్కర్‌’ వివాదాన్ని పెంచొద్దు: శరద్‌ పవార్‌ జోక్యంతో తగ్గిన కాంగ్రెస్‌

దివంగత హిందుత్వ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మాటల దాడి మహారాష్ట్రలోని మహా వికాస్‌ ఆగాఢీ కూటమిలో కాక పుట్టిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారకుండా సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ రంగంలోకి దిగారు.

Updated : 29 Mar 2023 06:14 IST

దిల్లీ: దివంగత హిందుత్వ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మాటల దాడి మహారాష్ట్రలోని మహా వికాస్‌ ఆగాఢీ కూటమిలో కాక పుట్టిస్తుండటంతో పరిస్థితి మరింత దిగజారకుండా సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ రంగంలోకి దిగారు. ‘‘ప్రభుత్వానికి క్షమాపణలు కోరేందుకు నేను సావర్కర్‌ను కాదు.. గాంధీని’’ అంటూ రాహుల్‌ ఇటీవల చేసిన విమర్శలతో కూటమిలోని తమ భాగస్వామి శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే) నొచ్చుకొంటున్న విషయాన్ని పవార్‌ కాంగ్రెస్‌ నాయకత్వానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీనికి కాంగ్రెస్‌ సానుకూలంగా స్పందించినట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.

ఉద్ధవ్‌కు రాహుల్‌ ఫోన్‌ చేశారు: సంజయ్‌రౌత్‌

‘మేం రాహుల్‌తో మాట్లాడాం. మా పోరాటం మోదీతో.. సావర్కర్‌తో కాదు. దీనిపై ఉద్ధవ్‌కు రాహుల్‌ ఫోన్‌ చేశారు’ అని ఉద్ధవ్‌ఠాక్రే వర్గం శివసేన నేత సంజయ్‌రౌత్‌ మీడియాకు చెప్పారు. ‘‘మా కూటమి విడిపోతుందని ఎవరైనా అనుకుంటే.. అది నిజం కాదు’’ అన్నారు. సోమవారం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నిర్వహించిన ప్రతిపక్ష నేతల సమావేశంలో శరద్‌ పవార్‌ ‘సావర్కర్‌’ అంశాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్రలో ఎంతో ఆదరణ ఉన్న సావర్కర్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు రాష్ట్రంలోని తమ కూటమికి మేలు చేయబోవని స్పష్టం చేశారు. సావర్కర్‌ ఎన్నడూ ఆరెస్సెస్‌ సభ్యుడు కాదని, అనవసర విమర్శలతో ప్రతిపక్షాల పోరాటం పక్కదోవ పడుతుందని రాహుల్‌గాంధీకి పవార్‌ హితబోధ చేశారు. సమావేశంలో పాల్గొన్న తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌, ఆర్జేడీ, భారాస నేతలు సైతం ఈ విషయంలో ఉద్ధవ్‌ వాదనకే మద్దతు పలికినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి ఉద్ధవ్‌ఠాక్రే వర్గ శివసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు