పేపర్‌ లీకేజీ కేసును నియంత్రిస్తున్నారు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును మంత్రి కేటీఆర్‌ నియంత్రిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రశ్నపత్రాలను అమ్ముకుంటుంటే ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Published : 01 Apr 2023 02:29 IST

కేటీఆర్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణ
‘టీఎస్‌పీఎస్సీ’ ఘటనపై ఈడీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును మంత్రి కేటీఆర్‌ నియంత్రిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రశ్నపత్రాలను అమ్ముకుంటుంటే ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పేపర్‌ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలంటూ లేఖ రాయాలని కేటీఆర్‌ను డిమాండ్‌ చేశారు. లీకేజీ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం శుక్రవారం ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కమిషన్‌ వెల్లడించకుండా కటాఫ్‌ మార్కులు ఎంతో కేటీఆర్‌కు ఎలా తెలిసింది? 415 మంది జగిత్యాల నుంచి గ్రూప్‌-1 పరీక్ష రాశారని ఆయన ఎలా చెప్పారు? అధికారులు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నప్పుడు.. మరి ఎవరిచ్చారో చెప్పాలి’’ అని రేవంత్‌ అన్నారు. ‘ఈ కేసులో రూ.కోట్ల లావాదేవీలు నగదు రూపంలో జరిగాయి, విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు చేతులు మారాయి’ అనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఈడీని కోరినట్లు చెప్పారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ఇంతవరకు సీఎం కేసీఆర్‌ స్పందించలేదని విమర్శించారు. ‘‘ఆధారాలు బయటపెడితే తిరిగి మా మీదే కేసులు పెడుతున్నారు. శంకర్‌లక్ష్మి నుంచి నేరం మొదలైతే ఆమెను సాక్షిగా పెట్టారు. కేసులో ఏ1గా ఆమెను, ఏ2గా ఛైర్మన్‌ను, ఏ3గా సెక్రటరీని చేర్చాలి. కేసులో దిగువస్థాయి ఉద్యోగులను బలి పశువులను చేయడానికే సిట్‌ ఏర్పాటు చేశారు. గతంలో సిట్‌ వేసిన కేసులన్నీ తప్పుదోవ పట్టించారు’’ అని విమర్శించారు. ఈ కేసులో సిట్‌ ఇప్పటివరకు సీజ్‌ చేసిన వాటిని ఈడీ తీసుకొని, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈడీని కలిసిన వారిలో పార్టీ నాయకులు మహేష్‌కుమార్‌ గౌడ్‌, మల్లు రవి, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్‌, అనిల్‌కుమార్‌, రోహిన్‌రెడ్డి, సాయికుమార్‌, చరణ్‌ కౌశిక్‌ తదితరులున్నారు. అంతకుముందు నేతలు సీఎల్పీ కార్యాలయంలో కొద్దిసేపు సమావేశమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని