అన్న రాజమోహన్‌రెడ్డి ఎదుగుదలకు కృషిచేస్తే.. ప్రస్తుతం నాపై రాజకీయం చేస్తున్నారు!

‘ప్రభుత్వం అండ ఉన్న వారు ఏ ఆటలైనా ఆడతారు.. నేను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. 2024 ఎన్నికల్లో చూసుకుంటా’ అని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated : 01 Apr 2023 07:11 IST

ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి ఆవేదన

మర్రిపాడు, న్యూస్‌టుడే: ‘ప్రభుత్వం అండ ఉన్న వారు ఏ ఆటలైనా ఆడతారు.. నేను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. 2024 ఎన్నికల్లో చూసుకుంటా’ అని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం మర్రిపాడులోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తన అన్న, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, కుటుంబం కోసం ఎంతో మందితో గొడవపడ్డానని చెప్పారు. అధికారం ఎక్కడ పోతుందోనని. ఆయన ఒక బృందాన్ని పెట్టుకొని ఊరేగుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత గొడవలకు రాజమోహన్‌రెడ్డి సలహాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అన్నదమ్ములు ఉంటారనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంతకుముందు మేకపాటి వాళ్లు ఆనందంగా ఉంటారనుకునేవారు.. ఇప్పుడు భలేగా ఉందయ్యా అన్నదమ్ముల యవ్వారం అనుకుంటున్నారు అన్నారు.

గుండె నొప్పి వచ్చింది: ‘నా ఆరోగ్యం ప్రస్తుతం సరిగాలేదు. గురువారం రాత్రి కూడా గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యా. వైద్యులను సంప్రదించి నెల్లూరు, చెన్నైకు వెళతా. ఆరోగ్యం కుదుటపడితే రాజకీయంలో ఉంటా.. లేకుంటే దూరమవుతా’ అని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.


వైకాపా నీడ లేకుంటే తెలుస్తుంది
ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా క్రాస్‌ ఓటింగ్‌ చేస్తే చర్యలు తీసుకోవడం సరైనదేనని తన నాన్న, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి సమర్థించినట్లు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మర్రిపాడులో ఆయన మాట్లాడుతూ.. తన చిన్నాన్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించారు. ‘నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ చేశారని పార్టీ నమ్మింది. అందుకే చర్యలు తీసుకుంది. ఆ హక్కు పార్టీకి ఉంది. క్రమశిక్షణ లేకపోతే పార్టీని నడపడం కష్టం’ అని అన్నారు. 2024 ఎన్నికల్లో సత్తా చూపుతానని చెబుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లగా ‘ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. వైకాపా, కుటుంబాల నీడ లేకుండా సొంతంగా పోటీ చేయనీయండి.. ఎవరు ఏమిటో తెలియవస్తుంది’ అని వ్యాఖ్యానించారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు