Nara Lokesh:వివేకా హత్య అనంతరం... లోటస్‌పాండ్‌లో సమావేశం పెట్టారు

‘మాజీ మంత్రి వివేకా హత్య అర్ధరాత్రి 2.30 గంటలకు జరిగితే తెల్లవారుజాము 4.30 గంటలకు లోటస్‌ పాండ్‌లో సమావేశం జరిగింది.

Updated : 03 May 2023 07:24 IST

అందులో పాల్గొన్న నలుగురినీ విచారించాలి
మాస్టర్‌మైండ్‌ దొరకడం ఖాయం
యువగళం సభలో  తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు, కర్నూలు: ‘మాజీ మంత్రి వివేకా హత్య అర్ధరాత్రి 2.30 గంటలకు జరిగితే తెల్లవారుజాము 4.30 గంటలకు లోటస్‌ పాండ్‌లో సమావేశం జరిగింది. గుండెపోటుతో బాబాయ్‌ చనిపోయారని ఆ సమావేశంలో ఉన్న నలుగురు ముఖ్యమైన వ్యక్తులకు జగన్‌ చెప్పారు’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. యువగళం పాదయాత్రలో భాగంగా కోడుమూరులో మంగళవారం రాత్రి నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. బాబాయ్‌ హత్య కేసు మిస్టరీ రోజుకో మలుపు తిరుగుతోందన్నారు. లోటస్‌పాండ్‌లో సమావేశం జరిగే సమయానికే మృతదేహానికి కుట్లువేసి కట్టుకట్టే కార్యక్రమం పూర్తిచేశారని అన్నారు. ఆ సమావేశంలో ఉన్న నలుగురినీ విచారిస్తే నిజమైన మాస్టర్‌ మైండ్‌ దొరకడం ఖాయమన్నారు. ‘జగన్‌ పేదలకు పట్టిన శని’ అని, ఆయన రూ.లక్ష కోట్లు ఏ విధంగా సంపాదించారన్న రహస్యాన్ని పేదలకు చెప్పాలని డిమాండు చేశారు. ధనవంతులు, పేదలకు మధ్య ధర్మయుద్ధం జరుగుతుందని అంటున్న జగన్‌ తన తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని రూ.లక్ష కోట్లు సంపాదించారని ఆరోపించారు. జగన్‌కు లోకేశ్‌ అంటే భయమని అందుకే రోజుకో రౌడీ గ్యాంగును తనపైకి పంపిస్తున్నారని ఆరోపించారు. వాళ్లను చూసి ఆగిపోవడానికి తాను ప్యాలెస్‌ పిల్లిని కాదని జగన్‌ను వేటాడే పులినని గుర్తు చేశారు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం, చంద్రబాబు విజన్‌ గురించి రజనీకాంత్‌ మాట్లాడారని, రాజకీయాలేవీ మాట్లాడలేదని చెప్పారు. ‘చంద్రబాబు గొప్పతనం గురించి రజనీకాంత్‌ చెప్పడం చూసి జగన్‌ టీవీని పగలకొట్టారట’ అని వివరించారు. రజనీకాంత్‌ సింహంలా సింగిల్‌గా వచ్చి మాట్లాడితే.... వైకాపా నాయకులు గుంపులుగా వచ్చి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ది శాడిస్టు స్వభావమని, తండ్రిని పొగిడినా సహించలేరని ఆరోపించారు. ‘ఆయన ప్రజావేదికను కూల్చారు.. రుషికొండకు గుండుకొట్టారు.. మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. అందుకే ఆయనను శాడిస్ట్‌ జగన్‌’ అని పిలుస్తున్నానని పేర్కొన్నారు. ఆయన హయాంలో రాష్ట్రం అడుక్కుతినే పరిస్థితికి వచ్చిందన్నారు.

ఒక్క దళిత కుటుంబం అయినా బాగు పడిందా

‘స్థానిక ఎమ్మెల్యే సుధాకర్‌ నన్ను అడ్డుకుంటారట.. ఎమ్మెల్సీ అనంతబాబు అతని డ్రైవర్‌ను కొట్టి చంపితే ఏమి చేశావు బ్రదర్‌’ అని లోకేశ్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులు ఏవిధంగా అన్యాయాలు, దాడులకు గురవుతున్నారన్న విషయాలను కేసుల వారీగా వివరించారు. ‘తనను ఎవరూ గౌరవించడం లేదని.. అవమానాలకు గురవుతున్నాననీ మంగళవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే సుధాకర్‌ వాస్తవాల్ని ఒప్పుకొన్నారు. ఆయన తన పరిస్థితి ఏమిటో చూసుకోవాలి. వైకాపా హయాంలో ఒక్క దళిత కుటుంబమైనా బాగుపడిందా’ అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పెత్తనం అంతా షాడో ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డిదని.. నియోజకవర్గంలో ఎక్కడ స్థిరాస్తి వెంచర్‌ వేయాలన్నా షాడో ఎమ్మెల్యేకి పదిశాతం కప్పం కట్టాలని ఆరోపించారు. కోడుమూరు కొండరాయుడు కొండను వైకాపా ఎర్రమట్టి మాఫియా అడ్డంగా తవ్వేసిందన్నారు. కోడుమూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి ఆకెపోగు ప్రభాకర్‌ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని