Pawan Kalyan: పొత్తులతోనే ముందుకు.. అంగీకరించని పార్టీలను ఒప్పిస్తాం

వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు సాగుతామని, అంగీకరించని పార్టీలను వాస్తవ గణాంకాలు చూపి ఒప్పిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

Updated : 12 May 2023 06:44 IST

కూటమి ద్వారా ప్రజలకే అధికారం దక్కాలి
ఆ దిశగా పని చేసి సాధిస్తాం
సీఎం పదవి వరించాలి.. వెంపర్లాడను
జూన్‌ నుంచి క్షేత్రస్థాయిలోనే
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే ముందుకు సాగుతామని, అంగీకరించని పార్టీలను వాస్తవ గణాంకాలు చూపి ఒప్పిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. సీఎం పదవి తానై వరించాలి తప్ప దాని కోసం వెంపర్లాడనని తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో కనీసం 30 నుంచి 40 స్థానాల్లో గెలిచి ఉంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి కోసం డిమాండ్‌ చేసే అవకాశం ఉండేదన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రంలో జనసేన బలం రెట్టింపయిందన్నారు. ‘వైకాపా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ, అస్తవ్యస్తం చేస్తుంటే మౌనంగా ఎందుకుంటాం? ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులు పెట్టుకుంటాం. కొంతమంది అంగీకరించకపోవచ్చు. వారితో మాట్లాడతాం. వాస్తవ గణాంకాలు చూపి ఒప్పిస్తాం. దిల్లీకి వెళ్లి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన తర్వాత కూడా ఇదే చెప్పాం. నా నిర్ణయం మారదు’ అని వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘పొత్తులకు మాకున్న ఏకైక షరతు ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించాలి. వైకాపా నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలి. కూటమి ద్వారా తిరిగి ప్రజలకు అధికారం దక్కాలి. ఆ దిశగానే పనిచేస్తాం. సాధిస్తాం’ అని స్పష్టం చేశారు. ‘నేను బలంగా (పొత్తులకు) కట్టుబడి ఉన్నా. అందరూ కలిసి వస్తే సంతోషం. మా గౌరవానికి భంగం కలగనంతవరకు పొత్తులతోనే ముందుకెళ్తామని ఘంటాపథంగా చెప్పగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి వైకాపా దాష్టీకాలను బలంగా ఎదుర్కొంటాం’ అని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్న నేపథ్యంలో.. జూన్‌ నుంచి క్షేత్రస్థాయిలోనే ఉంటామని చెప్పారు.

మీరు తగ్గడమేంటి అనేవాళ్లు.. నాకెప్పుడూ మద్దతివ్వలేదు

‘రెండు, మూడు సందర్భాల్లో తెలుగుదేశం నాయకుల్ని నేను కలిసినప్పుడు చాలా మందికి ఇబ్బంది వచ్చింది. మీరు తగ్గడమేంటి, వాళ్ల దగ్గరకు వెళ్లడమేంటి అన్నారు. మీరే సీఎం అభ్యర్థిగా ఉండాలన్నారు. లేదంటే పొత్తు పెట్టుకోకూడదన్నారు. అలా విమర్శించే వారిలో ఏ ఒక్కరూ.. ఏ రోజూ నాకు వ్యక్తిగతంగా మద్దతు పలకలేదు. నావైపు నిలబడలేదు’ అని పవన్‌ చెప్పారు. ‘నాతో నడిచేవాళ్లే నావాళ్లు. నేను మా పార్టీ ద్వారా రాష్ట్రం కోసం పని చేస్తాను. అర్థం చేసుకునే వాళ్లు అర్థం చేసుకుంటారు. ఉన్నతమైన దృష్టితో చూస్తే నేను అందరికీ అర్థమవుతాను. ఒక పార్శ్వంలోనే చూస్తే ఇంకోలా కనిపిస్తాను’ అని వివరించారు.

రాష్ట్ర ప్రయోజనాలపైనే దృష్టి

‘గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం. అప్పుడు కనీసం 30 నుంచి 40 సీట్లు వచ్చి ఉంటే ఇలాంటి (సీఎం కావాలన్న) వాదనకు పస ఉండేది. కర్ణాటకలో కుమారస్వామి గౌడలా అవకాశాలు ఉంటాయి’ అని పవన్‌ వ్యాఖ్యానించారు. ‘పెద్దన్న పాత్ర వహించమని చెప్పాను అంటే బాధ్యత వహించడం. నేను చాలా బాధ్యతగా ఉంటాను. కేవలం ఒక కులం కోసం పనిచేస్తే రాజకీయం ఎందుకు అవుతుంది? అది కుల సమీకరణ అవుతుంది. ఇది ఒక కులానికి సంబంధించినది కాదు. రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. కులపక్షం వహించవచ్చు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఆలోచిస్తాం. ఆ కోణంలోనే పొత్తులు అనే పదం వాడాం. దానికే కట్టుబడి ఉన్నాం’ అని చెప్పారు.

బలం ఉన్న ప్రధాన పార్టీలు కలవాలి

వైకాపా ఓటు చీలనివ్వకూడదంటే.. బలం ఉన్న ప్రధాన పార్టీలు కలవాల్సిన అవసరం ఉందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తెదేపాతో పొత్తు విషయం ఎంత వరకు వచ్చిందని విలేకర్లు ప్రశ్నించగా.. ‘కూటమి అనేది క్లిష్టమైన వ్యవహారం. 2019 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా. అప్పటి నుంచి పొత్తులు చూస్తున్నా. ఇప్పుడు భారాసగా మారిన తెరాస కూడా పొత్తులతోనే బలపడింది. భాజపా సహా అన్ని పార్టీలూ అంతే. ప్రతి పార్టీకి వారిదైన ఓటు శాతం, బలమైన వర్గం, ఓటింగ్‌ సరళి ఉంటుంది. అది ఎంతవరకు ప్రభావితం చూపగలదు, ఎంతమేర సీట్లు సంపాదించగలదనేది దృష్టిలో పెట్టుకోవాలి. అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం నాది.. లెఫ్ట్‌, రైట్‌ అనే వైరుద్ధ్య భావాలు నాకు లేవు. అయితే భాజపా, కమ్యూనిస్టులు ఒకరితో మరొకరు కలవరు. దశాబ్దాల అనుభవమున్న కమ్యూనిస్టు పార్టీలను గౌరవిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఎన్నికల్లో ప్రభావం చూపే పార్టీలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. కమ్యూనిస్టులు కూడా కలిసొస్తే మంచిదే. కానీ కలిసిరారు. అసెంబ్లీలోకి బలమైన సమూహాన్ని అడుగుపెట్టించాలనే దృఢ నిశ్చయంతోనే రాజకీయ పార్టీ పెట్టాం’ అని వివరించారు.

రెట్టింపైన జనసేన బలం

గత ఎన్నికలతో పోలిస్తే జనసేన బలం రెట్టింపయిందని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘మేం తెప్పించుకున్న సమాచారం ప్రకారం మాకు 24% నుంచి 30% వరకు ఓటింగ్‌ ఉంది. రాయలసీమలాంటి కొన్ని ప్రాంతాల్లో లేకపోవచ్చు. కానీ మాకు పట్టున్న ప్రాంతాల్లో 30% బలం ఉంది. సగటున 14- 18% ఓటింగ్‌ ఉంది. ఆ లెక్కన బలం ఉన్న చోట.. 36 లేదా 38 స్థానాల్లో ఉంటాం. మా బలంపైనే ఆధారపడి, వాస్తవ లెక్కలను దృష్టిలో పెట్టుకుని నడుస్తాం’ అని వివరించారు. ‘మా ప్రయాణమంతా రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేయడానికే. పార్టీ పెట్టింది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. 2014 నుంచి 2019 వరకు క్షేత్రస్థాయి సమస్యలపై అధ్యయనం చేశాం. ఆ తర్వాతే 2019 ఎన్నికల్లో 137 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టగలిగాం. నేను సీఎం అవుతానా? గెలుస్తానా? అనేది ఆలోచించలేదు. సగటున 7% ఓట్లు సాధించాం. ప్రతికూల పరిస్థితుల్లో అదేమీ తేలిక కాదు. బలమున్నచోట 18%, 20%.. కొన్నిచోట్ల 30% వరకు వచ్చింది’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

సినిమాల్లోనూ.. సూపర్‌స్టార్‌ను నేనే సాధించుకున్నా

‘నేను నిస్వార్థంగా రాజకీయాల్లో ఉన్నా. పదవులు వాటంతటవే మన కష్టంపై వరించి రావాలంటున్నా.  ఇదే మాట మనోహర్‌ అంటే.. మీరు వాళ్లను సీఎం చేయడానికి ఉన్నారా? వీళ్లను సీఎం చేయడానికి ఉన్నారా? అని వక్రీకరించి మాట్లాడారు. అలాంటి వారు ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘గత ఎన్నికల్లో 137 స్థానాల్లో పోటీ చేశాం. కనీసం 30 నుంచి 40 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారు. అలాంటప్పుడు (ముఖ్యమంత్రి పదవి కావాలనే) మన వాదనలో పస ఉండదు. సినిమాల్లోనూ నన్నెవరూ సూపర్‌స్టార్‌ చేయలేదు. నేను సాధించుకున్నా. అలాగే రాజకీయాల్లోనూ తెలుగుదేశం, భాజపా, ఎవరైనా కానీ నన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఎందుకు అంటారు? నేనే తెదేపా, భాజపా అధ్యక్షుణ్ని అయినా అలాంటి మాట అనను. బలంతో సాధించి చూపించి పదవి తీసుకోవాలి. ఇలా అయితేనే అని షరతు పెడితే జరగదు’ అని పేర్కొన్నారు.

కష్టపడి పనిచేస్తే ముఖ్యమంత్రి పదవి వరించి తీరాలి

‘మన ప్రయత్నం మనం చేస్తే పదవి తనంతట తనే వస్తుంది. పల్లంలోకే నీరు వస్తుంది. తటాకం తవ్వాక వర్షం చుక్క అక్కడే ఇంకుతుంది. నేను కష్టపడి పనిచేస్తే ముఖ్యమంత్రి పదవి అనేది వరించి తీరాలి. నేను దాని కోసమే పనిచేస్తున్నా’ అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ‘మీరు సీఎం రేసులో లేనట్లేనా?’ అని ఒక విలేకరి (ఈనాడు కాదు) అడిగిన ప్రశ్నకు ఆయన పై సమాధానమిచ్చారు. ‘నేను సీఎం రేసులో లేనని చెబితే వివాదమవుతుంది... ఎక్కువ తిడతారనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.

గ్రామీణ వ్యవస్థను చంపేశారు

‘వైకాపా అండతో గెలిచామని చాలా మంది సర్పంచులు అనుకున్నారు.. నిధులివ్వనప్పుడు గెలిచి ఉపయోగమేంటి? వైకాపా ప్రభుత్వం వచ్చాక గ్రామీణ వ్యవస్థను చంపేశారు’ అని పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ‘కేరళ మంత్రి ఒకరు నాకు ఫోన్‌ చేసి.. ఓసారి కేరళకు వచ్చి, పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూడమని ఆహ్వానించారు. అక్కడ ఒక రోడ్డు వేస్తున్నప్పుడు ఎంత మందం, ఎన్ని అంగుళాలు అనేది ప్రతి ఒక్కరినీ కూర్చోబెట్టి రాయాలి. అలా రాయలేదని ప్రతిపక్ష నాయకులు గొడవ చేశారు. అంతటి అవగాహన అక్కడ ఉంది. కేరళ తరహాలో రాష్ట్రంలోనూ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి. వాటి నిధులు వాటికే ఇవ్వాలి. గ్రామస్వరాజ్యం రావాలంటే పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావాలి. ఈ క్రమంలో సర్పంచులకు లేఖ రాస్తున్నాం. మాకు అండగా నిలబడే అన్ని పార్టీల సర్పంచులకు నిధులొచ్చేలా చూస్తాం’ అని హామీ ఇచ్చారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని