రాచరిక వ్యవస్థను అమలు చేస్తున్న భాజపా

భాజపా మను ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తోందని ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌ ఆరోపించారు.

Published : 29 May 2023 04:33 IST

ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌
పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతిచే ప్రారంభం చేయించలేదని నిరసన దీక్ష

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భాజపా మను ధర్మశాస్త్రాన్ని అమలు చేస్తోందని ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు బెల్లయ్య నాయక్‌ ఆరోపించారు. పార్లమెంటు నూతన భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేత ప్రారంభింప చేయకపోవడానికి నిరసనగా పీసీసీ ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీభవన్‌లో నిరసన దీక్ష జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బెల్లయ్య నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి గిరిజన మహిళ కావడంతోనే ఆమెతో పార్లమెంటు భవనం ప్రారంభం చేయించలేదన్నారు. భాజపా రాచరిక వ్యవస్థను తీసుకువచ్చి వెనకబడ్డ వారిని బానిసల్ని చేసే పద్ధతిలో నడుస్తోందని విమర్శించారు. రాచరిక వ్యవస్థ వద్దు.. ప్రజారాజ్యం కావాలని.. అందరూ ఒక్కతాటిపైకి కావాలని కోరారు. అశోక చక్రం, అశోక చిహ్నాన్ని కాదని రాజదండం పెట్టారని, అది ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై ఆదివాసీ కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుడుతుందన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాల హక్కులను భాజపా హరిస్తోందన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, ఏఐసీసీ ఓబీసీ విభాగం జాతీయ సమన్వయకర్త కేతూరి వెంకటేశ్‌, రాష్ట్ర ఎస్టీసెల్‌ కోఆర్డినేటర్‌ రవినాయక్‌, చందా లింగయ్య మాట్లాడారు. దీక్ష అనంతరం సచివాలయం వద్ద ఉన్న ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లారు. అక్కడ తాళం వేసి ఉండటంతో వినతిపత్రాన్ని గేటుకు పెట్టి వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని