మళ్లీ మోదీయే ప్రధాని

గడచిన తొమ్మిదేళ్లుగా సాధించిన విజయాలే 2024లో మోదీ గెలుపునకు మెట్లని భాజపా పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠ ఇనుమడించడం, జాతీయ భద్రత, ఇళ్లు, మరుగుదొడ్ల వంటి సంక్షేమ పథకాలు, పైపులద్వారా మంచినీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగానికి ప్రోత్సాహంవంటి అంశాలే తమ విజయానికి బాటలు వేస్తాయని వెల్లడించింది.

Published : 30 May 2023 04:47 IST

తొమ్మిదేళ్ల విజయాలే మెట్లు
కేంద్ర మంత్రుల వెల్లడి
దేశవ్యాప్తంగా భాజపా తొమ్మిదేళ్ల సంబరాలు నేటి నుంచి ప్రారంభం

దిల్లీ: గడచిన తొమ్మిదేళ్లుగా సాధించిన విజయాలే 2024లో మోదీ గెలుపునకు మెట్లని భాజపా పేర్కొంది. అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠ ఇనుమడించడం, జాతీయ భద్రత, ఇళ్లు, మరుగుదొడ్ల వంటి సంక్షేమ పథకాలు, పైపులద్వారా మంచినీటి సరఫరా, మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగానికి ప్రోత్సాహంవంటి అంశాలే తమ విజయానికి బాటలు వేస్తాయని వెల్లడించింది. 2014 మే 26వ తేదీన అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. రెండోసారి 2019 మే 30వ తేదీన అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల విజయాలపై మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా 30 రోజులపాటు భాజపా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఇందులో భాగంగా సోమవారం దేశవ్యాప్తంగా కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వ విజయాలను వివరించారు.

దేశమే ముందు అంటూ మోదీ అమలు చేసిన విధానాలతో ప్రతి రంగంలోనూ దేశం అభివృద్ధి చెందిందని భాజపా ఒక ప్రకటనలో పేర్కొంది. అందువల్లే ప్రఖ్యాత ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు 21 శతాబ్దం భారత్‌దేనని పేర్కొంటున్నారని తెలిపింది.
2024లో మళ్లీ కచ్చితంగా గెలుస్తామని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఈసారి 300కుపైగా సీట్లలో విజయం సాధిస్తామని చెప్పారు. అహ్మదాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తొమ్మిదేళ్లలో కేంద్రం పేదల కోసం 3.5 కోట్ల ఇళ్లను, 11.72 కోట్ల మరుగుదొడ్లను నిర్మించిందని తెలిపారు. 9.6 కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లను అందజేసిందని వివరించారు.    

* 9.6 కోట్ల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్లను అందజేసిందని వివరించారు. 60కోట్ల మందికి ఉచిత వైద్యం అందించిందని, 80కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఇచ్చిందని వెల్లడించారు.

* 2014కు ముందు కాంగ్రెస్‌ అవినీతిలో రికార్డులు సృష్టించిందని, భాజపా వచ్చాక సంక్షేమ పథకాలతోపాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌లను ఏర్పాటు చేసిందని తెలిపారు. 27శాతం ప్రజలను పేదరికం నుంచి బయటకు తెచ్చామని చెప్పారు. 

* 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వేశాఖ కేవలం రూ.2వేల కోట్లే కేటాయించేదని, మోదీ ప్రభుత్వం వచ్చాక రూ.10,200 కోట్లను కేటాయించామని రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ గువాహటిలో తెలిపారు. గువాహటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురికి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.

* సురక్షితమైన సరిహద్దులను, ప్రపంచస్థాయి మౌలిక వసతులను మోదీ ప్రభుత్వం అందించిందని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ లఖ్‌నవూలో తెలిపారు. ‘తొమ్మిదేళ్లలో మోదీ ప్రభుత్వం నాలుగు సుదృఢ స్తంభాలను నిర్మించింది. అవి గౌరవం, ఇంటాబయటా పొంచి ఉన్న ముప్పుల నుంచి రక్షణ, పేదల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి’ అని ఆయన వెల్లడించారు.

* కొవిడ్‌ సమయంలో తీసుకున్న చర్యలు, వ్యాక్సిన్ల తయారీకి ఇచ్చిన ప్రోత్సాహం మోదీ పనితీరుకు నిదర్శనమని గిరిజన వ్యవహారాలశాఖ మంత్రి అర్జున్‌ ముండా రాయ్‌పుర్‌లో వ్యాఖ్యానించారు.

* స్వయంశక్తితో ఎదిగే దేశంగా భారత్‌ను మోదీ తయారు చేశారని, 12 కోట్ల మందికి మంచినీటి కొళాయిలను ఇచ్చారని పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దిల్లీలో తెలిపారు.

* సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమంలో మోదీ ప్రభుత్వం రికార్డు సృష్టించిందని, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ సిమ్లాలో పేర్కొన్నారు.

* మోదీ విధానాలన్నీ పేదలకు ఉపయోగపడేలా వారిచుట్టే తిరిగాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ హైదరాబాద్‌లో తెలిపారు.

* ఇంకా ముంబయిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పట్నాలో జైశంకర్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, జైపుర్‌లో పీయూష్‌ గోయెల్‌, రోహ్‌తక్‌లో స్మృతి ఇరానీ, భోపాల్‌లో భూపేంద్ర యాదవ్‌, భువనేశ్వర్‌లో జి.కిషన్‌రెడ్డి మాట్లాడారు. పలుచోట్ల మంత్రులు, భాజపా నేతలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని