భాజపా మేనిఫెస్టోకు శ్రీకారం

రాష్ట్ర శాసనసభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు భాజపా శ్రీకారం చుట్టింది. దీంతోపాటు బీసీ డిక్లరేషన్‌ రూపకల్పనలో భాగంగా వివిధ రంగాల నిపుణులతో భాజపా బాధ్యులు భేటీ కానున్నారు.

Updated : 31 May 2023 05:08 IST

హామీలు...సమస్యలే కీలకాంశాలు
నేడు సంజయ్‌ సహా నిపుణులతో  టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు భాజపా శ్రీకారం చుట్టింది. దీంతోపాటు బీసీ డిక్లరేషన్‌ రూపకల్పనలో భాగంగా వివిధ రంగాల నిపుణులతో భాజపా బాధ్యులు భేటీ కానున్నారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన హామీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సాధికారత తదితర కీలకాంశాలపై అధ్యయనం చేయనున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా అభివృద్ధి అంశాలను గుర్తించే బాధ్యతను టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్‌ విఠల్‌ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అప్పగించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మేనిఫెస్టోలో కీలక అంశాలను చేర్చనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ కమిటీ వివిధ రంగాల నిష్ణాతులతో సమావేశమై రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన సమస్యలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించనుంది. ఈ సమావేశానికి పలువురు బీసీ మేధావులు, విద్యావేత్తలతోపాటు, వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

సమావేశంలో చర్చించిన అంశాల ప్రాతిపదికగా బీసీ డిక్లరేషన్‌ రూపొందించనున్నారు. ప్రధానంగా రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి భాజపా స్పష్టమైన హామీలతో ముందుకు వెళ్లనున్నట్లు తెలిసింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ 57 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాసంగ్రామ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు, గుర్తించిన సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరచనున్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం, పేదలకు ఇళ్లనిర్మాణం, ఉద్యోగాల భర్తీ, ఏటా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన, రైతులకు ఫసల్‌ బీమా అమలు వంటి కీలక అంశాలపై ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చనున్నారని తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా సాధికారత వంటి అంశాలపై సంబంధిత రంగాల నిపుణులతో చర్చించి టాస్క్‌ఫోర్సు రోడ్‌ మ్యాప్‌ను రూపొందించి పార్టీకి అందజేయనుంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నివేదిక అందిన వెంటనే పార్టీ కోర్‌ కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చించి మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నట్లు భాజపా ముఖ్యనేతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని