AP Ministers: చంద్రబాబు అరెస్టు ఆరంభం మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు అరెస్టు ఆరంభం మాత్రమేనని, ఆయనపై ఇంకా అనేక కేసులున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

Updated : 12 Sep 2023 08:49 IST

న్యూస్‌టుడే బృందం: చంద్రబాబు అరెస్టు ఆరంభం మాత్రమేనని, ఆయనపై ఇంకా అనేక కేసులున్నాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. త్వరలో మరిన్ని కేసులు తెరపైకి వస్తాయని వివరించారు. అవన్నీ బయటకు వస్తే చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. సోమవారం తిరుపతిలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. దిల్లీలో మేనేజ్‌మెంటు స్కిల్‌ ఉన్నవారితో పైరవీలు చేయడానికి తెదేపా నాయకులు సిద్ధమయ్యారని, వారితోపాటు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేరిపోయారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్టు అయితే రాష్ట్రం అగ్నిగోళమవుతుందని తెదేపా వారు భావిస్తే.. అది కాస్తా బుగ్గి అయిందని అన్నారు.


లోకేశ్‌, అచ్చెన్నాయుడూ త్వరలో అరెస్టు అవుతారు

తిరుపతిలో మంత్రి రోజా

‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం జరగలేదని, అందులో తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పగలరా? కోర్టులో వాదించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూ కుంటిసాకులు చెప్పారే తప్ప కుంభకోణం జరగలేదని చెప్పలేదు. ఇంకా ఫైబర్‌గ్రిడ్‌, అమరావతి భూములు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కుంభకోణాలున్నాయి. మళ్లీ మళ్లీ అరెస్టులుంటాయి. లోకేశ్‌, అచ్చెన్నాయుడూ త్వరలో అరెస్టు అవుతారు. భాజపా బంద్‌కు మద్దతు ఇవ్వకున్నా.. పవన్‌ ఎందుకిచ్చారు? బాబు అవినీతిపై గతంలో పవన్‌ మాట్లాడటం నిజం కాదా? షెల్‌ కంపెనీల్లో పవన్‌కూ వాటా ఉన్నట్టుంది. దర్యాప్తులో అన్నీ బయటకొస్తాయి’.


అరెస్టులో కక్ష సాధింపు లేదు

విశాఖలో మంత్రి అమర్‌నాథ్‌

‘అక్రమాలకు పాల్పడినందునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసింది. చంద్రబాబును అరెస్టులో రాజకీయ కక్ష సాధింపేమీ లేదు. తన తండ్రి తప్పు చేయలేదని లోకేశ్‌ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అరెస్టు చేసిన విధానాన్నే తప్పు పడుతున్నారు తప్ప అక్రమాలకు పాల్పడలేదని ఎవరూ చెప్పలేకపోతున్నారు. పవన్‌ కల్యాణ్‌.. లోకేశ్‌కన్నా ఎక్కువ బాధపడుతున్నారు’.


లోకేశ్‌ పాత్ర ఉన్నట్లు సమాచారం.. హోం మంత్రి తానేటి వనిత

ఈనాడు, విశాఖపట్నం: ‘నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో రూ.370 కోట్ల అవినీతి జరిగిందని సీఐడీ నివేదికలో బలమైన ఆధారాలుండటంతోనే న్యాయస్థానం చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. విచారణ పూర్తయ్యాక ఎవరి ప్రమేయమెంత? అనేది తేలుతుంది. ఇందులో లోకేశ్‌ పాత్ర ఉన్నట్లు సమాచారం ఉంది’ అని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఆమె సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు. 2014-19 మధ్య జరిగిన మరో మూడు స్కాంలు త్వరలో వెలుగులోకి వస్తాయని తెలిపారు. ‘ఇటీవల రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ను ఆధునికీకరించాం. భద్రత పటిష్ఠంగా ఉంది. చంద్రబాబుకు ప్రత్యేక బ్యారెక్‌ ఇచ్చాం. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లేవు’ అని అన్నారు.


దత్తపుత్రుడిని ప్రజలు గమనిస్తున్నారు.. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా

మైదుకూరు, న్యూస్‌టుడే: ఐదేళ్లలో ఎన్నో కుంభకోణాలు జరిగినా ప్రజల పక్షాన నిల్చొని ఏనాడూ ప్రశ్నించని, ప్రభుత్వాన్ని నిలదీయని దత్తపుత్రుడు రోడ్డుపైకి వచ్చి హల్‌చల్‌ చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరులో సోమవారం ఆయన ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని