ప్రిసైడింగ్‌ అధికారి ‘పెన్ను’పోటు?.. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో భాజపా విజయం

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు చేపట్టిన ప్రిసైడింగ్‌ అధికారి అనిల్‌ మాసిహ్‌ బ్యాలెట్‌ పత్రాలపై పెన్నుతో ఏవో రాతలు రాసి.. 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని కాంగ్రెస్‌-ఆప్‌ తీవ్ర ఆరోపణలు చేశాయి.

Updated : 31 Jan 2024 06:41 IST

చండీగఢ్‌ : చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు చేపట్టిన ప్రిసైడింగ్‌ అధికారి అనిల్‌ మాసిహ్‌ బ్యాలెట్‌ పత్రాలపై పెన్నుతో ఏవో రాతలు రాసి.. 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారని కాంగ్రెస్‌-ఆప్‌ తీవ్ర ఆరోపణలు చేశాయి. ప్రిసైడింగ్‌ అధికారి చర్య వల్ల- తగినంత సంఖ్యా బలం(16) లేకపోయినా భాజపా మేయర్‌ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నప్పటికీ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)-కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఓటమి పాలయ్యారు. మంగళవారం జరిగిన ఈ ఎన్నికలో మొత్తం 36 ఓట్లు పోలయ్యాయి. వాటిలో మనోజ్‌ సోంకర్‌కు 16, కుల్దీప్‌ కుమార్‌కు 12 ఓట్లు దక్కాయి. 8 ఓట్లు చెల్లుబాటు కాలేదు. పొత్తులో భాగంగా మేయర్‌ పదవికి ఆప్‌, సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టాయి. సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఆప్‌, కాంగ్రెస్‌ పార్టీల కౌన్సిలర్లు నిరాకరించారు. దీంతో భాజపా అభ్యర్థులు కుల్జిత్‌ సంధు, రాజిందర్‌ శర్మలు ఆయా పదవులకు పోటీలేకుండా ఎన్నికయ్యారు. చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ విమర్శించారు. ప్రిసైడింగ్‌ అధికారి  బ్యాలెట్‌ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్‌, ఆప్‌ ఆరోపించాయి.

హైకోర్టును ఆశ్రయించిన ఆప్‌

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ..దాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నిక జరిపించాలంటూ ఆప్‌ మంగళవారం పంజాబ్‌-హరియాణా హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారాన్నంతా విశ్రాంత హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో నిర్వహించాలని ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ కుల్దీప్‌ కుమార్‌ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని