Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు.

Updated : 19 Mar 2024 07:33 IST

తీవ్రంగా స్పందించిన వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టరు

ఈనాడు-కడప, కిర్లంపూడి, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. చీరలు పంపిణీ చేసిన వ్యవహారంపై వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టరు విజయరామరాజు తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదురెడ్డి ఆదివారం కొర్రపాడు రోడ్డులోని తన సొంత స్థలంలో దూదేకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రంజాన్‌ సందర్భంగా మహిళలకు చీరలు ఇస్తున్నట్లు చెప్పి ఈ కార్యక్రమానికి తరలించారు. చీరల కోసం టోకెన్లు జారీ చేశారు. ఈ అంశంపై పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. వీటి ఆధారంగా కలెక్టరు.. ఆర్‌వో ఖతీబ్‌ కౌసర్బానో, పురపాలక కమిషనరు రఘునాథరెడ్డిని విచారణకు ఆదేశించారు.

వాస్తవాలు తేలడంతో పంపిణీకి బాధ్యులుగా వైకాపా నేతలు పగిడాల దస్తగిరి, సి.నాగూర్‌లుగా గుర్తించారు. వీరిపై పురపాలక కమిషనరు, ఆర్‌వోల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చిత్రాలతో ఉన్న గోడ గడియారాలనూ పంపిణీ చేస్తుండటం గమనార్హం.

కాకినాడ జిల్లా జగ్గంపేట వైకాపా అభ్యర్థి, మాజీ మంత్రి తోట నరసింహం సోమవారం విలేకర్లకు తాయిలాలు అందజేశారు. కిర్లంపూడి మండలం వీరవరంలోని తన నివాసానికి వారిని పిలిపించుకుని నూతన వస్త్రాలు పంపిణీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని