మొన్నటివరకు చెట్లు తొలగించారు.. ఇప్పుడు ఇళ్లు పీకేస్తారు

‘ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే మొన్నటివరకు రోడ్డు పక్కనున్న చెట్లు తొలగించారు.. ఆయన హెలికాప్టర్‌లో తిరిగితే బస్సులు, బడులు చివరకు రోడ్డుపై రాకపోకలూ నిలిపేశారు.

Updated : 27 Mar 2024 06:20 IST

జగన్‌ బస్సు యాత్రపై చంద్రబాబు చెణుకులు
పులివెందులలో ఆయనకు ఓటేస్తే ఆ మట్టికి ద్రోహం చేస్తున్నట్లే
కుప్పానికి నీళ్లు విడుదల చేశానని డ్రామాలాడారు
మీడియా సమావేశంలో జగన్‌పై మండిపడ్డ తెదేపా అధినేత 

ఈనాడు, చిత్తూరు: ‘ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే మొన్నటివరకు రోడ్డు పక్కనున్న చెట్లు తొలగించారు.. ఆయన హెలికాప్టర్‌లో తిరిగితే బస్సులు, బడులు చివరకు రోడ్డుపై రాకపోకలూ నిలిపేశారు. ఆయన ఇప్పుడు బస్సుయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. అంటే ప్రజల ఇళ్లూ పీకేస్తారు’ అని తెదేపా అధినేత చంద్రబాబు.. నేటి నుంచి ప్రారంభం కానున్న జగన్‌ బస్సు యాత్రపై చెణుకులు వేశారు. ఇంత అరాచక, దుర్మార్గ పాలనను తానెన్నడూ చూడలేదన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం కాలువకు నీళ్లు విడుదల చేయాలంటూ గత నెలలో ఇక్కడ పర్యటించిన జగన్‌.. రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేసుకుని సభావేదిక వద్దకు చేరుకున్నారని ఎద్దేవా చేశారు. ‘కుప్పం భూమి మీద నడిస్తే ఆయన అరిగిపోతారా? ఈ మహానుభావుడు వచ్చారని అన్నీ బంద్‌ చేయించారు’ అని విమర్శలు గుప్పించారు.

ప్రజలు ఛీకొడతారనే ఇంగితజ్ఞానం లేకుండా నీటి విడుదల డ్రామాలు ఆడారని.. ఎక్కడి నుంచో గేట్లు తీసుకువచ్చారని.. జగన్‌ అటువెళ్లగానే గేట్లు తొలగించారని, నీళ్లూ రాలేదని విమర్శించారు. వైకాపా డ్రామా కంపెనీని ఈ అయిదేళ్లూ నడిపారని.. త్వరలో శాశ్వతంగా మూసేస్తారని జోస్యం చెప్పారు. రేపో ఎల్లుండో ఆయన కుప్పం రావాలని నిర్ణయించారని.. మళ్లీ ఏముఖం పెట్టుకుని ఇక్కడకు వస్తారని చంద్రబాబు నిలదీశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఫిబ్రవరి 26న సీఎం జగన్‌ నీళ్లు విడుదల చేసిన ప్రాంతానికి చంద్రబాబు మంగళవారం సాయంత్రం వచ్చారు. అక్కడ కృష్ణా జలాలు లేకపోవడంపై విస్మయం వ్యక్తంచేసి ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారు. స్థానికులు కొందరు కాలువలో గొర్రెలు మేపుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాలువలోకి దిగి నీళ్లు విడుదల చేసినప్పుడు మట్టి కూడా కరగలేదని చెరువులు నింపడమంటే ఇదేనా అని నిలదీశారు. కనీసం 10 కిలోమీటర్లు కూడా ప్రవహించలేదని.. ఒక్క చెరువూ నింపలేదన్నారు. అనంతరం కాలువ పక్కనే మీడియా సమావేశం నిర్వహించారు.

వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలి 

‘రాజీనామా చేసిన వాలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకోవాలి. లబ్ధిదారులకు సంబంధించిన రహస్య సమాచారమంతా వారి ఫోన్లు, ఐప్యాక్‌ బృందం యాప్‌లలో ఉంది. తక్షణమే సాఫ్ట్‌వేర్‌ ప్యాకేజీని సీజ్‌ చేయాలి. ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలిశాం. మరోసారి విజ్ఞప్తి చేస్తాం. ‘జె’ బ్రాండ్‌ మద్యం అమ్ముతున్నారంటే కాదని నిరూపించుకోవాలి. మీరు (వైకాపా నాయకులు) దోషులు కాబట్టే ఎదురుదాడి చేశారు. గతంలో గుజరాత్‌లో పట్టుబడిన డ్రగ్స్‌ చిరునామా విజయవాడలో ఉంది. అప్పుడు మేం ప్రశ్నిస్తే తెదేపా కార్యాలయంపై దాడి చేశారు. సంధ్య ఆక్వా చిరునామాతో విశాఖకు డ్రగ్స్‌ వస్తే అధికారులు ఎందుకు వెళ్లారు? వైకాపా నాయకుల చిత్రాలతో సంక్రాంతి సమయంలో ఫ్లెక్సీలు వేశారు. బ్రెజిల్‌ అధ్యక్షుడి ఎన్నికపై విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. అయినా మాపైనే నెపం వేస్తున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గులు? ఎలాంటి వ్యక్తులో అర్థం చేసుకోవాలి. తప్పుచేసి ఎదురుదాడి చేయడం వీరి నైజం. గంజాయి, మాదకద్రవ్యాలను పట్టుకుంటుంటే ముఖ్యమంత్రి సమీక్ష జరపాలి కదా? ఒక్కసారైనా చేశారా’ అని చంద్రబాబు ప్రశ్నించారు. బాలకృష్ణ, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ నిలబడిన చోట మహిళలను అభ్యర్థులుగా నిలిపారని.. కుప్పంలోనూ ఎమ్మెల్సీ భరత్‌ భార్యను నిలుపుతారా అని అడగ్గా.. వారు (వైకాపా అభ్యర్థులు) ఓడిపోతారనో, ఓడగొట్టాలనో చూస్తున్నట్లున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రేపు పులివెందులలో జగన్‌ గెలుస్తారా? ఎవరైనా జగన్‌కు ఓటువేస్తే వాళ్లు ఆ భూమికి, సొంత కుటుంబానికీ ద్రోహం చేస్తున్నట్లే’ అని అన్నారు.

జగన్‌ బొమ్మలు తొలగించాలి

‘వేరే రాష్ట్రాల్లోకన్నా ఆంధ్రప్రదేశ్‌లో రికార్డులు పకడ్బందీగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నవాబుకాలంలోని రికార్డులు సక్రమంగా లేకపోవడంతో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్‌గా ఉన్న బన్వర్‌లాల్‌ బోర్డులు పెట్టారు. నిజాం భూములు, పాకిస్థాన్‌కు వెళ్లిన వ్యక్తుల భూములు తీసుకుని అభివృద్ధి చేశాం. వైకాపా ప్రభుత్వం ఇప్పుడు సర్వే రాళ్లపై జగన్‌ చిత్రం వేసింది. పాసు పుస్తకాలపైనా ఆయన బొమ్మ ముద్రించారు. వాటిని తొలగించాలి. ఇది తుగ్లక్‌ పరిపాలన. ఈ దుర్మార్గులను శిక్షించాలి’ అని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని