తెరాసలోకి నలుగురు భాజపా కార్పొరేటర్లు

హైదరాబాద్‌ వేదికగా శనివారం నుంచి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా... ఒక రోజు ముందు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లోని నలుగురు భాజపా కార్పొరేటర్లు,

Published : 01 Jul 2022 05:44 IST

 కండువా కప్పి స్వాగతించిన మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ వేదికగా శనివారం నుంచి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనుండగా... ఒక రోజు ముందు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లోని నలుగురు భాజపా కార్పొరేటర్లు, తాండూరు పురపాలక భాజపాపక్ష నేత, మరో కౌన్సిలర్‌ తెరాసలో చేరారు. జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్‌, హస్తినాపురం, రాజేంద్రనగర్‌, అడిక్‌మెట్‌ కార్పొరేటర్లు డేరంగుల వెంకటేశ్‌, బానోతు సుజాతనాయక్‌, పొడవు అర్చనప్రకాశ్‌, సునీతాప్రకాశ్‌గౌడ్‌లతో పాటు తాండూరు పురపాలక భాజపా ఫ్లోర్‌ లీడర్‌ సింధూజగౌడ్‌, కౌన్సిలర్‌ ఆసిఫ్‌లకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారిని అభినందించారు. విశ్వనగర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దిల్లీలో కలిసిన జీహెచ్‌ఎంసీ భాజపా కార్పొరేటర్ల బృందంలో తాజాగా తెరాసలో చేరిన నలుగురు కూడా ఉన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోదీ శనివారం హైదరాబాద్‌ వస్తున్నారు. అంతకంటే ముందే వీరు తెరాసలో చేరడం కలకలం సృష్టించింది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల నాయకత్వంలో హైదరాబాద్‌ అద్భుతంగా ప్రగతి చెందుతోందని, తమ డివిజన్లు సైతం అదే స్థాయిలో అభివృద్ధి చెందాలన్న ప్రజాభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కార్పొరేటర్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని