వైకాపా రాష్ట్రానికి హానికరం

రాష్ట్రానికి వైకాపా అనేది హానికరమని, వారి రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. సమర్థమైన నాయకత్వం లేకే రాష్ట్రం

Updated : 04 Jul 2022 07:39 IST

రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించాలి

నేరస్థులకు ప్రభుత్వం అండ

మేం వస్తే తప్పు చేసినోడి తోలుతీసేలా పాలిస్తాం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

‘జనవాణి.. జనసేన భరోసా’ పేరిట ప్రజల నుంచి వినతుల స్వీకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి వైకాపా అనేది హానికరమని, వారి రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. సమర్థమైన నాయకత్వం లేకే రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని ధ్వజమెత్తారు. ‘వైకాపా సమర్థత అంతా.. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి.. ప్రత్యర్థి పార్టీలను ఎలా ఇబ్బందులు పెట్టాలనే విషయంలోనే’ అని దుయ్యబట్టారు. జనసేనను గెలిపిస్తే బాధ్యతతో కూడిన పరిపాలన అందిస్తామని, తప్పుచేసేవాడి తోలుతీసేలా శాంతి భద్రతలను కాపాడతామని హామీ ఇచ్చారు. విజయవాడలోని ఎంబీకే భవన్‌లో ‘జనవాణి.. జనసేన భరోసా’ పేరిట ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ‘అన్యాయం జరిగిందని అడిగితే పథకాలు ఆపేస్తున్నారు. పోలీసు కేసులు పెడుతున్నారు. వారి పిల్లలపై కేసులు పెట్టి విదేశాలకు వెళ్లకుండా చేస్తున్నారు. లేకపోతే దాడులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. రాజకీయం అంటే ఓట్లు కొనేసి అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారం మరిచిపోవడం కాదు. ఏం జరుగుతుందని ప్రశ్నిస్తే బూతులు తిట్టడం రాజకీయం అనిపించుకోదు’ అని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

ఫీజులు కట్టని ముద్దుల మామయ్య 

‘మీరు బాగా చదువుకోండి ముద్దుల మామయ్య దగ్గర బోలెడు డబ్బులున్నాయి. ఫీజులు కట్టేస్తానన్నారు. కానీ ఇప్పుడు కట్టకుండా విదేశాల్లో తిరుగుతున్నారు. మూడు దఫాలుగా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ చెల్లించడం లేదు. ఈ కారణంగానే బీటెక్‌ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. విదేశీ విద్య పథకం ఆపేశారు. శ్రీలంక, వెనెజువెలాలో ఆర్థిక పరిస్థితి దెబ్బతినడానికి అక్కడ వనరులు లేకపోవడం కాదు. సమర్థ నాయకత్వం లేకపోవడమే కారణం. ఇక్కడా అలాగే ఉంది. గుంటూరు జిల్లాలో సీఎంకు చెందిన సరస్వతీ పవర్‌ అండ్‌ మినరల్స్‌ కోసం 10, 12 ఏళ్ల కిందట 300 ఎకరాలు తీసుకున్నారు. పరిహారం ఇవ్వలేదు. ఫ్యాక్టరీ మొదలు పెట్టలేదు. సాగు చేసుకోలేక రైతులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. క్రిమినల్స్‌ను ఈ ప్రభుత్వం వెనకేసుకొస్తోంది. చిలకలూరిపేటలో భర్త ముందే భార్య మానమర్యాదలు తీసేస్తే, మహిళా హోంమంత్రి నేరగాళ్లను వెనకేసుకొచ్చారు. వాళ్లు వెళ్లింది దొంగతనానికని, మానమర్యాదలు తీయడానికి కాదని, పొరపాటున జరిగిందని చెప్పారు. పండగలు, పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు, ప్రెస్‌మీట్లు పెట్టి బూతులు తిట్టేందుకు వీళ్లకు సమయం ఉంటుంది. ప్రజల సమస్యలు తీర్చడానికి మాత్రం లేదు. ఐదేళ్ల బిడ్డ జీవితాన్ని పాడు చేసిన ఓ అధికార పార్టీ నాయకుడిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఓ అర్జీ ద్వారా నా దృష్టికి వచ్చింది’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

కాపులకు అన్యాయం 

‘మాట్లాడితే కులాలుగా విడగొడతారు. నేను కాపు కులానికి చెందిన వ్యక్తినని కాపులతో తిట్టిస్తుంటారు. సీఎం కాపులకు అన్యాయం చేస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే బెదిరిస్తారు. ముస్లింలకు, ఎస్సీ, ఎస్టీలకూ అంతే. ఎస్సీ, ఎస్టీ పథకాలు, సబ్‌ప్లాన్‌ అమలు చేయకుండా, కొందరు నాయకులకే ప్రయోజనాలు చూపించి పేదలకు అన్యాయం చేస్తున్నారు. నేరస్థులను వెనకేసుకొస్తున్న పాలకుల్ని చూస్తే ప్రజలకు ఎందుకు కోపం రావడం లేదు? గూండాలకు, దగాకోరులకు భయపడాలా? దీన్ని కచ్చితంగా జనసేన బ్రేక్‌ చేస్తుంది’ అని చెప్పారు.

427 ఫిర్యాదుల స్వీకరణ 

జనవాణి కార్యక్రమంలో వివిధ జిల్లాల వచ్చిన ప్రజలు పవన్‌ కల్యాణ్‌కు సమస్యలను విన్నవించారు. ప్రజల సమస్యల్ని సావధానంగా విని ప్రతి విషయాన్ని నమోదు చేసుకున్నారు. దివ్యాంగులు వస్తే వేదిక దిగి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. అధికార పార్టీ దాష్టీకాలు, శాంతి భద్రతల సమస్య, టిడ్కో గృహాల కేటాయింపులో అక్రమాలు, పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, రహదారులకు గతుకులుండడం వంటి సమస్యలపై ఫిర్యాదులు అందినట్లు జనసేన ప్రకటించింది.  ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో డయాలసిస్‌ కేంద్రం లేదని పలువురు కిడ్నీ బాధితులు ఆయనకు తెలిపారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కార్యక్రమాన్ని నిర్దేశించినా అనేక జిల్లాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలను వివరించారు. సుమారు 427 ఫిర్యాదులు వచ్చాయి.

ఇదే మొదటి సమస్యగా స్వీకరిస్తా 

‘తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి భద్రత పేరుతో అక్రమంగా ఇల్లు కూల్చివేతపై శివశ్రీ కుటుంబం నా దగ్గరకు వచ్చి సమస్యను విన్నవించుకుంటే వైకాపా నేతల ప్రోద్బలంతో వారిపై అక్రమంగా కేసులు పెట్టారు. శివశ్రీ అన్నయ్య అనిల్‌ కుమార్‌ అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై పోలీసులు ఎలాంటి విచారణ జరపలేదు. దీన్ని నేను, జనసేన వ్యక్తిగతంగా తీసుకుంటున్నాం. అనిల్‌ కుమార్‌ ఎలా చనిపోయాడనే విషయాన్నే జనవాణిలో మొదటి సమస్యగా స్వీకరిస్తున్నాం. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తాం’ అని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

* వచ్చే ఆదివారం జనవాణి కార్యక్రమాన్ని విజయవాడలోనే నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.


బ్రాందీ షాపులపై సంపాదన

‘సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పినోళ్లు, బ్రాందీ షాపులు పెట్టి దానిపై సంపాదన కోసం చూస్తున్నారు. ప్రహరీ లేకుండా కబేళా ఉంటే.. నిర్దాక్షిణ్యంగా గోవధ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? సమస్య లేవనెత్తితే ఓట్లు పోతాయని వాళ్లకు భయం. విజయవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ ఆగడాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తోంది? స్పందన కార్యక్రమం ద్వారా 98 శాతం సమస్యలు పరిష్కరించామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ సమస్యలు చాలా ఉన్నాయి. అందుకే నా దగ్గరకు వచ్చారు’ అని పవన్‌ పేర్కొన్నారు.


ప్రజల కష్టాలపై పోరాడతాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని