Huzurabad: హుజూరాబాద్‌ రణరంగం

హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తెరాస-భాజపాలు పిలుపునివ్వడం స్థానికంగా మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్‌ రెడ్డి తెరాస శ్రేణులతో కలిసి శుక్రవారం ఉదయం 11 గంటలకు

Updated : 06 Aug 2022 03:43 IST

తెరాస-భాజపా ఆందోళనలతో ఉద్రిక్తత  

ఈనాడు, కరీంనగర్‌, హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తెరాస-భాజపాలు పిలుపునివ్వడం స్థానికంగా మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్‌ రెడ్డి తెరాస శ్రేణులతో కలిసి శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. చర్చకు భాజపా శ్రేణులు తరలివచ్చే పక్షంలో అది గొడవలకు దారితీస్తుందని భావించిన పోలీసులు ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్‌ చేశారు. అయినా వేదిక వద్దకు కొందరు భాజపా నాయకులు రావడం, మహిళా నేతలు వేదికపైకి ఎక్కే ప్రయత్నం చేయడం, తెరాస శ్రేణులు వారిని అడ్డుకోవడంతో గొడవ మొదలైంది. అప్రమత్తమైన పోలీసులు భాజపా నేతలను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. చర్చా వేదికపై కౌశిక్‌రెడ్డి మాట్లాడి వెళ్తున్న సమయంలో అనూహ్యంగా భాజపా నాయకులు కొందరు అంబేడ్కర్‌ చౌరస్తాకు రావడం ఇరువర్గాల మధ్య మరోసారి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో భాజపా-తెరాస శ్రేణులు చెప్పులు, జెండా కర్రలను విసురుకుంటూ పోటాపోటీ నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం రణరంగమైంది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతోపాటు భాజపా నాయకుల్ని స్టేషన్‌కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ బహిరంగ చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి ఈటలకు లేదన్నారు. గజ్వేల్‌లో పోటీచేస్తానన్న ఆయన వాఖ్యలను ఆ పార్టీ అధ్యక్షుడు ఖండించడమే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు సభాస్థలి వరకు రాకుండా తమను అడ్డుకున్న పోలీసులు తెరాస వాళ్లను ఎలా అనుమతించారని భాజపా నాయకులు ప్రశ్నించారు.


తెరాసలో చేరికలు ఉండవు: ఈటల

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఇకపై ఆ పార్టీలో కొత్తగా ఎవరూ చేరే పరిస్థితి లేదని, ఉన్నవాళ్లూ బయటకు వెళ్తారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఘటనకు స్పందిస్తూ శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రగతిభవన్‌ కేంద్రంగా తనను అభాసుపాలు చేసేందుకు పన్నిన కుట్ర, ఆ క్రమంలో తెరాస నేతల చిల్లర వేషాలు వారికే బెడిసికొట్టాయని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలపై మాట్లాడటం, హామీలు అమలుచేయమని సీఎంను అడగడం తప్పా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో తెరాస, కాంగ్రెస్‌ల నుంచి భాజపాలోకి చేరికలు భారీగా ఉంటాయన్నారు. 21న మునుగోడులో జరిగే సభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు ఆయా పార్టీలకు రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రాజయ్యయాదవ్‌, మురళీయాదవ్‌లు భాజపాలో చేరే అవకాశాలున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని