మాధవ్‌ను రక్షించడానికి ఎస్పీ ప్రయత్నించడం సిగ్గుచేటు

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రక్షించడానికి అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పడిన ఆరాటం..పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు

Published : 12 Aug 2022 05:08 IST

వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామన్న హోంమంత్రి, సజ్జల ప్రకటనలు అబద్ధమా?

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రక్షించడానికి అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పడిన ఆరాటం..పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అసలు మాధవ్‌కు క్లీన్‌చిట్‌ ఇవ్వడానికి ఎస్పీ ఎవరని ప్రశ్నించారు. ఆయన ఓ జిల్లాకు ఎస్పీలా వ్యవహరించ లేదని దుయ్యబట్టారు. మాధవ్‌ నగ్న వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని, రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామని హోంమంత్రి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన విషయాలు నిజం కాదా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గోరంట్ల మాధవ్‌పై ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసు నమోదు చేయలేదని ఫక్కీరప్ప చెబుతున్నారు. రేపు అనంతపురం వీధుల్లో మాధవ్‌ నగ్నంగా తిరుగుతాడు.. అప్పుడూ ఎవరూ కేసు పెట్టలేదు కదా అని వదిలేస్తారా. సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సింది పోయి ఇలా వ్యవహరించడం తగదు. అసలు ఈ వీడియో వచ్చిన రోజే మాధవ్‌ సెల్‌ఫోన్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఎంపీ వీడియో కాల్‌ లిస్టును ఎందుకు సేకరించలేదు? ఈ మొత్తం వ్యవహారంలో ఎంపీని రక్షించాలనే ఆలోచన తప్పితే నిజానిజాలు వెలికితీయాలన్న తపన ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు’ అని ఆయన మండిపడ్డారు.

గోరంట్ల మాధవ్‌ లాంటి వ్యక్తి ఎంపీగా పార్లమెంట్‌లో కూర్చొవడం మొత్తం దేశానికే అవమానకరమని వర్ల రామయ్య మండిపడ్డారు. ‘మాధవ్‌ను లోకసభ స్పీకర్‌ అనర్హుడిగా ప్రకటించి బహిష్కరించాలి. ఆయన నగ్న వీడియో వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. చేసిన పనికి సిగ్గుపడాల్సింది పోయి రెండు సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేలా మాధవ్‌ మాట్లాడారు. ఇదీ శిక్షార్హమే. కానీ ఎస్పీ ఇవేమీ ఆలోచించలేదు. దీనిపై రాష్ట్రపతి, ప్రధాని, లోకసభ స్పీకర్‌లకు లేఖలు రాస్తాం. ’ అని వర్ల రామయ్య చెప్పారు. 


ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా నాటకాలాడుతున్నారు: ఎంఎస్‌ రాజు

గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా ప్రభుత్వ పెద్దలు, పోలీసులు నాటకాలాడుతున్నారని తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. అడ్డంగా దొరికిపోయి ఆ నెపాన్ని చంద్రబాబు, నారా లోకేశ్‌, కొన్ని మీడియా సంస్థలపైకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. గురువారం జూమ్‌ ద్వారా ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘వీడియో ఒరిజినలా కదా అని తేల్చాల్సింది ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కానీ ఎస్పీ కాదు. గోరంట్ల మాధవ్‌ను కాపాడటానికే ఎస్పీ ఫక్కీరప్పతో మీడియా సమావేశం పెట్టించారు. ఆయన వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు’ అని ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు.


అనంతపురం ఎస్పీ తప్పుడు ప్రకటనలిస్తున్నారు: పంచుమర్తి అనురాధ

గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారంలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప తప్పుడు ప్రకటనలిస్తున్నారని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. గోరంట్ల మాధవ్‌ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు జగన్‌రెడ్డి సహా వైకాపా నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు రోజా, కారుమూరి నాగేశ్వరరావులు ప్రయత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘న్యూడ్‌ వీడియోతో అడ్డంగా దొరికిపోయిన ఎంపీని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సింది పోయి..ఆయనను సమర్థిస్తూ వైకాపా నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టడం ఆ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనం. తప్పు చేసి కులం రంగుపులుముతున్నారు. హోంమంత్రి మాటలకూ, ఎస్పీ విలేకరుల సమావేశానికీ పొంతన లేదు. చంద్రబాబు, నారా లోకేశ్‌ లను మాధవ్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.


విద్యా దీవెన మూడు విడతలే ఇస్తూ జగన్‌ మోసం చేస్తున్నారు: రామానాయుడు

జగనన్న విద్యా దీవెనను నాలుగు విడతల్లో చెల్లిస్తామని చెప్పి..మూడు విడతలే ఇస్తూ విద్యార్థులను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని..ఇది జగనన్న ‘దగా దీవెన’అని  తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. దీంతో కళాశాలల యాజమాన్యాలు జగన్‌ ఎగ్గొట్టిన నాలుగో విడత నగదును విద్యార్థుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయని, దీంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే ఇంజినీరింగ్‌, పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా జీవో 77ను తెచ్చారు. ప్రభుత్వం అర్థాంతరంగా సాయం నిలిపేయడంతో ఇంజినీరింగ్‌, డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు తమ చదువును పూర్తి చేయలేకపోతున్నారు. కేంద్రం విడుదల చేసిన నిధులనూ దారి మళ్లిస్తున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.


మాధవ్‌కు సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోండి
జాతీయ మహిళా కమిషన్‌కు వంగలపూడి అనిత లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌పై..ఆయనకు సహకరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియోను జాతీయ ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో పరీక్షించి నిజాలు నిగ్గుతేల్చాలని కోరారు. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్‌కు గురువారం ఆమె లేఖ రాశారు. ‘రాష్ట్రంలో వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలపై దాడులు పెరిగాయి. మహిళలు అభద్రతాభావంతో బతుకుతున్నారు. దీనికి గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారమే నిదర్శనం. ఈ ఉదంతంలో సరైన విచారణ చేయకుండా ఎంపీకి క్లీన్‌చిట్‌ ఇచ్చారు. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఎలాంటి దర్యాప్తూ చేయకుండానే వీడియో మార్ఫింగ్‌ చేశారని చెబుతున్నారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని వంగలపూడి అనిత లేఖలో కోరారు.


మాధవ్‌ ఫోన్‌ఎందుకు స్వాధీనం చేసుకోలేదు
అనంతపురం ఎస్పీకి హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ లేఖ

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి నిర్ధారించకుండా.. ప్రెస్‌మీట్‌ పెట్టి ఫేక్‌ అని ఎలా తేలుస్తారని హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. మాధవ్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఐప్యాడ్‌ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఇప్పటి వరకు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని కోరుతూ అనంతపురం ఎస్పీకి గురువారం ఆయన లేఖ రాశారు. ‘సైబర్‌ నేరాల విషయంలో నేర నిర్థారణ ఫోరెన్సిక్‌ ప్రక్రియతో ప్రారంభమవుతుంది. వీడియోను ల్యాబ్‌కు పంపకుండా ప్రెస్‌మీట్‌ పెట్టి మీరే ఫేక్‌ అని నిర్థారించినట్లు ఉంది. ఇది దర్యాప్తు ప్రక్రియను తీవ్రంగా ఉల్లంఘించడమే’ అని గూడపాటి తన లేఖలో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని