icon icon icon
icon icon icon

రూ.4000 - రూ.3000 ఏది కావాలో తేల్చుకోండి!

రాష్ట్రంలో రాజకీయం పింఛను చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇదే ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా... పార్టీలకు ముఖ్య ప్రచారాస్త్రం ఆసరాగా నిలవాల్సిన పింఛన్ల విషయంలో న్యాయం చేసిందెవరు? మోసం చేసిందెవరు?

Updated : 07 May 2024 06:41 IST

వివిధ వర్గాల లబ్ధికి ఆద్యుడు చంద్రబాబే
పింఛన్ల చరిత్రలో తెదేపాది సామాజిక విప్లవం
అభాగ్యులకు జగన్‌ చేసిందంతా దగానే
ఎక్కడా లేని నిబంధనలు పెట్టి ఇబ్బడిముబ్బడిగా కోత
ఈ ఇబ్బందులను తీర్చేలా ఈసారి తెదేపా వరాల జల్లు
ఈనాడు, అమరావతి

రాష్ట్రంలో రాజకీయం పింఛను చుట్టూ పరిభ్రమిస్తోంది. ఇదే ఈ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా... పార్టీలకు ముఖ్య ప్రచారాస్త్రం ఆసరాగా నిలవాల్సిన పింఛన్ల విషయంలో న్యాయం చేసిందెవరు? మోసం చేసిందెవరు? ఆచి తూచి, పరిశీలించాల్సిన విషయమిది...

  • అర్హులందరికీ పింఛను ఇచ్చే ఆరాటంలో తెదేపా.. 
  • ఎక్కువ మందిని అనర్హులను చేసే పనిలో వైకాపా..
  • ఐదేళ్లలో పింఛను డబ్బులు ఎకాఎకి పది రెట్లు పెంచిన తెదేపా..
  • రూ.1000 పెంచేందుకు ఐదేళ్లు తీసుకున్న వైకాపా..
  • పింఛను చరిత్రలో సామాజిక విప్లవం తెచ్చిన తెదేపా..
  • లబ్ధిదారులను ఏమార్చే ప్రణాళికలో వైకాపా..
  • బడుగు, బలహీన వర్గాలకు ఆసరా అందించే దిశగా తెదేపా..
  • వారి జీవితాల్ని ప్రశ్నార్థకం చేసే ఆలోచనలో వైకాపా..
  • సంక్షేమానికి, సంక్షోభానికి... మంచికి, వంచనకు... అభ్యుదయానికి, జగన్నాటకానికి... మధ్య జరగబోయే ఈ ఎన్నికలో సరైన ఎంపిక... ఆంధ్రావని పునరుజ్జీవనానికి పూనిక!

తెదేపా గెలిస్తే... ఈ ఏప్రిల్‌ నుంచే అమలు

  • ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు రూ.1000 అదనం  
  • ఆ మూడు నెలలది కలిపి జులైలో ఇంటికే...
  • వరసగా రెండు నెలలు ఎవరైనా తీసుకోకపోయినా ఆ మొత్తం కలిపి మూడో నెల అందజేత
  • దివ్యాంగులకు రూ.6 వేల పింఛను
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను అమలు
  • పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేల పింఛను
  • కిడ్నీ సంబంధిత , తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు
  • వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దనే పింఛను అందజేత

అందరికీ వరాల మాల

అన్ని వర్గాలకూ అండగా నిలవడం అత్యవసరమని గుర్తించిన తెదేపా సామాజిక భద్రత పింఛన్ల చరిత్రలోనే ఒక విప్లవాన్ని సృష్టించింది. పార్టీ ఆవిర్భావం నుంచి బడుగులకు తిరుగులేని దన్నుగా నిలిచింది. అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఏయే వర్గాలకు ఆసరా అవసరమో ఎప్పటికప్పుడు గుర్తించి వారందరికీ అండగా నిలబడింది. మారుతున్న కాలం... పెరుగుతున్న నిత్యావసరాల ధరలు, ఖర్చులు అంచనా వేస్తూ పింఛను మొత్తాన్ని పెంచింది. 1984లో రూ.30 ఇచ్చింది. ఆ తర్వాత 1995లో రూ.75కి పెంచింది. 2014-19 మధ్య రూ.200గా ఉన్న పింఛను మొత్తాన్ని ఏకంగా రూ.2 వేలు చేసింది. అంటే ఐదేళ్ల వ్యవధిలో ఏకంగా 10 రెట్లు పెంచింది. ఇది సామాజిక భద్రత పింఛన్ల చరిత్రలోనే ఒక రికార్డు. అంతేకాదు... కొత్త వారికి పింఛన్లు ఇస్తున్నామని, ఏదో ఒక వంక పెట్టి పాత వారికి కోత వేయలేదు. ఎక్కడాలేని నిబంధనలు తెచ్చి కొర్రీలూ వేయలేదు. సామాజిక భద్రత పింఛనుదారులపై ఎప్పుడూ మానవతా దృక్పథంతోనే వ్యవహరించింది.

ఆ కష్టం...ఇక ఉండదు!

ర్నూలు, వైఎస్‌ఆర్‌, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక మంది వలస కార్మికులున్నారు. కొంతమంది ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో వృత్తిరీత్యా ఉంటున్న పిల్లల వద్ద ఉంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ సమయానికి పింఛను తీసుకోలేని వారూ ఉంటారు.  తెదేపా హయాంలో ఇలాంటివారు రెండు నెలలకో, మూడు నెలలకో తమ గ్రామాలకు వచ్చినప్పుడు పింఛను మొత్తాన్ని తీసుకునేవారు. ఇబ్బందులు కలిగించకుండా అధికారులూ సహకరించేవారు. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలనే నిబంధనను సీఎం జగన్‌ తేవడం వల్ల ఇలాంటివారికి పింఛను దక్కకుండా పోయింది. రెండున్నరేళ్ల నుంచి వేల మందికి ఇలా పింఛను మొత్తం అందకుండా చేశారు. తాజాగా చంద్రబాబు ఇలాంటివారికి ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించారు. అధికారంలోకి రాగానే వివిధ కారణాలతో 2 నెలలు పింఛను తీసుకోలేకపోయినవారికి మూడో నెలలో మొత్తం కలిపి ఒకేసారి ఇస్తామని హామీనిచ్చారు.

దివ్యాంగులకు 100 శాతం పెంపు....

పింఛను పెంచాలని ఎక్కువ శాతం వైకల్యమున్న వారు రెండు మూడేళ్లుగా మొత్తుకుంటున్నా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తెదేపా ప్రభుత్వమిచ్చిన రూ.3వేల పింఛనుతోనే సరిపెట్టింది. రూపాయి పెంచకపోగా ఇచ్చే రూ.3 వేలూ తానే పెంచి అమలు చేసినట్టు జగన్‌ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు దివ్యాంగులకు తెదేపా భారీ వరాన్ని ప్రకటించింది. అధికారంలోకి రాగానే వారికి అందుతున్న పింఛను మొత్తాన్ని రూ.6 వేలు చేస్తామని ప్రకటించింది.  ఇప్పుడున్న మొత్తానికి 100 శాతం పెంచుతామంది.

పింఛనుదారులకు తెదేపా వరాలు ప్రకటించింది. అధికారంలోకి వస్తే పింఛను రూ.4 వేలకు పెంచి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన ఆ పార్టీ.. దాన్ని ఏప్రిల్‌ నుంచే అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం రూ.3 వేల చొప్పున ఏప్రిల్‌ నెలకు పింఛను ఇచ్చింది. మే, జూన్‌ నెలల్లోనూ ఈ మొత్తాన్నే ఇవ్వనుంది. ఎన్నికలు ముగిశాక కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే జులైలో పింఛను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఆ నెలలో ఇచ్చే రూ.4 వేలతో పాటు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి అదనంగా రూ.వేయి చొప్పున మూడు నెలలది కలిపి అందిస్తామని తెలిపింది. అంటే జులైలో ఒక్కొక్కరికి రూ.7 వేల చొప్పున అందనుంది. ఇదేకాకుండా దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఇస్తామని ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తామని స్పష్టం చేసింది. పింఛనుదారుల ఇంటి వద్దనే పింఛను మొత్తాన్ని వాలంటీర్లతో అందిస్తామని వెల్లడించింది.

అదో స్వర్ణయుగం...

తెలుగుదేశం పాలనా కాలంలో 2014-19 మధ్య రూ.200 పింఛను మొత్తాన్ని రెండు విడతల్లో రూ.2 వేలకు పెంచడమే కాదు చర్మకారులకు, 50 ఏళ్లు పైబడిన డప్పు కళాకారులు, మత్స్యకారులు, 30 ఏళ్లుదాటిన ఒంటరి మహిళలు, 18 ఏళ్లు నిండిన హిజ్రాలకు తొలిసారిగా పింఛను మంజూరుచేశారు.

2014 డిసెంబరు : ఆదివాసీల వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించారు. 2019 ఫిబ్రవరిలో ఎస్టీలందరి వృద్ధాప్య పింఛను అర్హత వయసును 65 ఏళ్లనుంచి 50 ఏళ్లకు తగ్గించారు. వేల సంఖ్యలో ఎస్టీలు లబ్ధిపొందారు.
2017 : ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయించుకునే రోగులకు రూ.2,500 తొలిసారిగా మంజూరు చేశారు. 2018 జులైలో ప్రైవేటు ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయించుకున్నా వర్తింపచేశారు. 2019లో ఈ తరహా రోగులకిచ్చే పింఛను మొత్తాన్ని రూ.2,500 నుంచి రూ.3,500కు పెంచారు.
2018 జనవరి : 18 ఏళ్లు దాటిన హిజ్రాలకు రూ.1500 పింఛను మంజూరు చేశారు. సరిగ్గా ఏడాదికి ఆ పింఛను మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు.
2018 జూన్‌ : తొలిసారిగా 50 ఏళ్లుపైబడిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన డప్పు కళాకారులకు రూ.1,500 పింఛను మంజూరు చేశారు. ఏడాది తిరగకుండానే 2019 ఫిబ్రవరిలో వారికిచ్చే పింఛను మొత్తాన్ని రూ.3 వేలకు పెంచారు.
2018 నవంబరు : మొట్టమొదటిసారిగా చర్మకారులకు  రూ.1000 పింఛను మంజూరుచేశారు. ఆ తర్వాత రెండు నెలలకే చంద్రబాబు హయాంలోనే రూ.2 వేలకు పెరిగింది.
2018 : 50 ఏళ్లకన్నా వయసు పైబడిన మత్స్యకారులకు రూ.1000 పింఛను మంజూరుచేశారు.
2018 : ఒంటరి మహిళలకు రూ.1000 పింఛను ప్రకటించారు. తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచారు.

తెదేపా నుంచి అధికారమార్పిడి జరిగేనాటికి పింఛన్ల సంఖ్య 54 లక్షలకు చేరింది.


వైకాపా వస్తే... 2028 నుంచి రూ.3250

  • కొత్తగా వెంటనే ఏమీ పెరగదు. నాలుగేళ్ల తర్వాత 2028 జనవరిలో రూ.250, 2029 జనవరిలో రూ.250 పెరుగుతుంది. దివ్యాంగులకూ ఇదే పరిస్థితి
  • వరసగా రెండు నెలలు తీసుకోకపోతే ఆ మొత్తాన్ని మరుసటి నెలలో ఇవ్వరు. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలి
  • వరసగా మూడు నెలలు తీసుకోకపోతే పింఛను పూర్తిగా పోయినట్టే
  • బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకు పింఛను ఇవ్వరు
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేలు పింఛను (ఇప్పటికే అమలవుతోంది)

అన్నీ కోతలే..!

సంక్షేమానికి తానే ఆద్యుడనని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌ ఐదేళ్లలో పింఛనుదారులకు చేసిన దగా అంతాఇంతా కాదు. రకరకాల నిబంధనలతో, ఆదాయ పరిమితి, వ్యవసాయ భూమి వంటి షరతులతో తొలి దశలోనే చాలామంది లబ్ధిదారులకు కత్తెరవేశారు. అన్నీ ఉన్నా... అందరూ ఉన్నా... సరిగ్గా చూసుకునే వారు లేరనే సామాజిక భద్రత పింఛన్లను గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. అది తెలిసీ జగన్‌ దుర్మార్గంగా వ్యవహరించారు. ఇబ్బడిముబ్బడిగా కోత వేశారు. తెదేపా ప్రభుత్వంలో ఉన్న రూ.2 వేల పింఛనును రూ.3 వేలకు పెంచేస్తానని చెప్పి, అమలు చేయడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఏటా పెంచింది రూ.250 మాత్రమే. చివరి విడత రూ.250 ఎన్నికలు నాలుగు నెలల్లో ఉన్నాయనగా ఈ జనవరిలో పెంచారు. పెంచిన ప్రతిసారీ ఏదో సాకు చూపి పింఛనుదారుల సంఖ్యలో కత్తెర వేశారు. 80 శాతంపైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు, డప్పు కళాకారులు, హిజ్రాలకు తెదేపా ప్రభుత్వమే రూ.3 వేలు పింఛను అందించింది. వీరికి గత ఐదేళ్లలో జగన్‌ ఒక్క రూపాయీ పెంచింది లేదు.

రాకుంటే పింఛను ఉండదు...

చంద్రబాబు హయాంలో దూరా భారమో... ఆరోగ్య సమస్యలో... ఇతర పనులో ఉండి...ఏ నెల పింఛనును ఆ నెల తీసుకోకపోయినా తరువాత నెలలో మొత్తం కలిపి ఇచ్చేవారు. కానీ జగన్‌కు పేదలు ఇలా లబ్ధిపొందడం ఇష్టంలేదు. ఏ నెల పింఛను ఆ నెల తీసుకోవాలని కొత్త నిబంధన పెట్టారు. దీంతో ఇతర ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లే వారు, ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యేవారు...పింఛను తీసుకునేందుకు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పింఛను రద్దు చేస్తారన్న భయంతో దూరప్రాంతాల్లో ఉన్నవారు వ్యయప్రయాసలకోర్చి స్వగ్రామానికి వచ్చేవారు. ఇంతాజేసి వారికి మిగిలేది నామమాత్రమే. మూడు నెలలు వరసగా తీసుకోలేదనే కారణంగా ప్రతి నెలా 5వేల పింఛన్లు తొలగిస్తున్నారంటే ఈ నిబంధన ఎంతమందిపై  ప్రభావం చూపిందో స్పష్టమవుతోంది.

పదే పదే అబద్ధాలు...

తెదేపా ప్రభుత్వంలో 53.85 లక్షల మందికి పింఛన్లు అందేవి. దీనికోసం నెలకు రూ.1,305 కోట్లు ఖర్చు చేసేది. ఇది వైకాపా ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కే. దీన్ని దాచిపెట్టిన ముఖ్యమంత్రి జగన్‌ అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. తెదేపా ప్రభుత్వం 30 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేదని అసత్యాలు వల్లె వేస్తున్నారు. ప్రస్తుతం 65.95 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. తెదేపా ప్రభుత్వం అభయహస్తం పింఛన్లు, కళాకారులు, బ్రాహ్మణులు, సైనిక సంక్షేమ పింఛన్లు, అమరావతిలో భూముల్లేని పేదలకు ఇచ్చే పింఛన్లను సామాజిక భద్రత పింఛన్ల కింద చూపించలేదు. వాటిని ప్రత్యేకంగా అందించేది. కానీ.జగన్‌ మాత్రం వీటిని కూడా సామాజిక భద్రత పింఛన్ల కిందకే మార్చి అంకెలు పెంచి చూపిస్తున్నారు.

తెదేపా ప్రభుత్వంలో ఒకే కుటుంబంలో ఇద్దరు పింఛనుదారులున్నా భారంగా భావించకుండా ఆర్థికసాయం అందించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు... ఇలా వివిధ కేటగిరీల పింఛన్లు ఒకే ఇంట్లో ఉన్నా కోత వేయలేదు. జగన్‌ అధికారంలోకి రాగానే మొదట వేసిన వేటు వీరిపైనే. ఒకే రేషన్‌ కార్డుపై రెండు పింఛన్లు ఉండకూడదనే నిబంధన తెచ్చి విచ్చలవిడిగా తొలగించారు. ఇలా తీసేసింది పదో పాతికో కాదు....వేలల్లో. పేదలందరూ గగ్గోలు పెడుతున్నా....ఏమాత్రం చెవికెక్కించుకోలేదు. నివాస ధ్రువీకరణ పత్రాలు ఒక గ్రామంలో ఉండి.... ఇతర అవసరాలరీత్యా వేరేచోట ఉంటున్న లబ్ధిదారులు పోర్టబిలిటీ విధానంలో ఉన్నచోటే పింఛను తీసుకునే వెసులుబాటును 2021లో తీసేయించారు. దీంతో వేరే ఊళ్లలో, పిల్లల దగ్గర ఉంటున్న వృద్ధులు, వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి కల్పించారు.

ఒంటరి మహిళల వేదన

ఒంటరి మహిళలకు, భర్త నుంచి విడిపోయిన, వివాహం కాని స్త్రీలకు ఇచ్చే పింఛను మంజూరుకు నిబంధనలు తెచ్చారు. తెదేపా ప్రభుత్వం పట్టణాల్లో 35 ఏళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు పింఛను ఇవ్వగా.... జగన్‌ ఆ అర్హత వయసును కుదించారు. 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే పింఛను అందిస్తున్నారు..

పారదర్శకత అంటే ఇదేనా?

ఎక్కడా లేని పారదర్శక విధానాలను అమలు చేస్తున్నామని చెప్పే జగన్‌.....చేతల్లో దానికి పాతరేశారు. సామాజిక తనిఖీ చేస్తే ఏయే కారణాలు చూపి ఎంతమందికి పింఛన్లు ఎగ్గొట్టేది బయటపడుతుందని రెండేళ్లుగా పక్కనపెట్టారు. అర్హులు, అనర్హుల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు. తనిఖీకి పంపిన జాబితా సైతం జిల్లా అధికారులకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా జనవరిలో కొత్త పింఛన్లకుగాను 2.14 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే... 1.17 లక్షల మందికి మాత్రమే మంజూరుచేశారు. దాదాపు 97 వేల మందికి కారణాలు చెప్పకుండానే నిలిపేశారు. 2021 మేలో 50 వేలు, జూన్‌లో 45వేల మంది పింఛనుదారుల్లో తగ్గుదల ఉంటే... జులైలో ఏకంగా 1.30 లక్షల తగ్గుదల కనిపించింది. 2022 డిసెంబర్‌లో 57 వేలు, 2023 అక్టోబర్‌లో 24వేల తగ్గుదల ఉంది. ఇలా ప్రతి నెలా పింఛన్ల మంజూరు పరిశీలిస్తే అసాధారణ తగ్గుదల కనిపిస్తోంది.

కులవృత్తిదారులపై దొంగదెబ్బ

కులవృత్తి పింఛనుదారులపై జగన్‌ కక్షకట్టారు. జనవరిలో కొత్త పింఛన్ల మంజూరులో కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేతకారులు, డప్పు కళాకారులు, చర్మకారుల దరఖాస్తులన్నీ పక్కనపెట్టారు. వారందరూ పింఛను తీసుకునేందుకు అర్హులేనని క్షేత్రస్థాయిలో అధికారులు తేల్చినా పక్కనపెట్టారు. ఇక చేనేత కార్మికులపై మరింత దుర్మార్గంగా వ్యవహరించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛను మంజూరు చేసేందుకు చరిత్రలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రీ పెట్టని విధంగా నిబంధనలు తీసుకొచ్చారు. సంఘాల్లో ఉన్న వారు నెలకు 15 రోజుల చొప్పున ఏడాది పాటు చేనేత వృత్తిలో ఉన్నట్లు ఆధారాలు సమర్పించాలని పేర్కొన్నారు. మాస్టర్‌ వీవర్‌ దగ్గర కూలికి పనిచేస్తుంటే....ఆయన చెల్లించిన నెలవారీ కూలి డబ్బులు రెండేళ్లపాటు ఆ చేనేత కార్మికుని బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ అయినట్టు ఆధారాలు చూపించాలి. అంతేకాదు రెండేళ్లపాటు మాస్టర్‌ వీవర్‌ దగ్గరే పనిచేస్తున్నట్టు ధ్రువీకరణ కూడా ఇవ్వాలన్నారు. సొంత మగ్గం నేసే కార్మికులైతే జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డీసీ) లేదా ప్రైవేటు వ్యాపారి నుంచి రెండేళ్లపాటు కొనుగోలు చేసిన ముడి సరకుకు జీఎస్టీ చెల్లింపులు ఇవ్వాలని నిబంధన పెట్టారు. ఇలాగైతే ఒక్క చేనేత కార్మికునికి కూడా పింఛను మంజూరుకాదని జిల్లా కలెక్టర్లు స్పష్టంగా చెప్పినా...జగన్‌ చెవికెక్కించుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img