అయిదు గ్రామాలకు ఓ సీనియర్‌ నేత

మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని..భారీ మెజార్టీతో విజయం సాధించాలని కమలదళం నిర్ణయించింది. నియోజకవర్గంలోని పార్టీ శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులు, మండలాల అధ్యక్షులతో భాజపా రాష్ట్ర

Published : 13 Aug 2022 04:59 IST

ప్రతి వంద మంది ఓటర్లకు ప్రత్యేక వ్యవస్థ
భారీ మెజార్టీతో ఉప ఎన్నికల్లో  విజయం సాధించాలి
మునుగోడు ఉప ఎన్నికపై కమల దళం వ్యూహరచన

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని..భారీ మెజార్టీతో విజయం సాధించాలని కమలదళం నిర్ణయించింది. నియోజకవర్గంలోని పార్టీ శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జులు, మండలాల అధ్యక్షులతో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఎన్నారంలో శుక్రవారం సమావేశమై ఉప ఎన్నికపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ముఖ్యనేతలు, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు అంతా మునుగోడులో మోహరించాలని..ఒక్కో సీనియర్‌ నేతకు అయిదు గ్రామాల బాధ్యత అప్పగించాలని, ప్రతి వంద మంది ఓటర్లకు ఓ వ్యవస్థ ఏర్పాటుచేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. పాదయాత్ర పూర్తయ్యాక వచ్చి మునుగోడులోనే మకాం వేస్తానని బండి సంజయ్‌ నియోజకవర్గ నేతలకు తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా కమిటీలు వేసి అందులో యువతకు, మహిళలకు, రైతులకు కచ్చితంగా స్థానం కల్పించాలని నిర్ణయించారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం- తరుణ్‌ఛుగ్‌ మాట్లాడుతూ, దేశం అంతా మునుగోడుకేసి చూస్తోందని అన్నారు. ‘జాతీయ నాయకులతో సహా సీనియర్లకూ ఉపఎన్నిక బాధ్యతలిస్తాం. మీరంతా మోదీలుగా మారండి.. నేను త్వరలోనే మునుగోడులో మకాం వేస్తా. తెరాసను ఓడించాలి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో వచ్చే వారిని కలుపుకోవాల్సిన బాధ్యత మీదే’ అని కార్యకర్తలకు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. వివేక్‌ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జి గంగిడి మనోహర్‌రెడ్డి మునుగోడు వ్యూహంపై అభిప్రాయాలు చెప్పారు. నల్లు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శృతి, ప్రదీప్‌కుమార్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మనోహర్‌రెడ్డి పరిస్థితి ఏంటి?

సమావేశం అనంతరం నియోజకవర్గ నేతలు సంజయ్‌ని కలిసి..‘‘రాజ్‌గోపాల్‌రెడ్డిని బరిలో దింపబోతున్నారు. నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న గంగిడి మనోహర్‌రెడ్డి పరిస్థితి ఏంటి’’ అని అడిగారు. ‘‘నా పాదయాత్ర బాధ్యతలు ఆయనే చూస్తున్నారు.. నేను నడుస్తున్నా..ఆయన నడిపిస్తున్నారు. యాత్రతో అధికారంలోకి రాబోతున్నాం’’ అని సంజయ్‌ బదులిచ్చారు.

21నే అమిత్‌షా సభ: బండి సంజయ్‌

మునుగోడు నియోజకవర్గంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభ 21వ తేదీనే ఉంటుందని బండి సంజయ్‌ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. సభ వాయిదాపడిందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ఆగస్టు 21, 29తో పాటు సెప్టెంబరులో మరో రెండు తేదీల్ని సూచించాం. 21న సభకు హాజరయ్యేందుకు అమిత్‌షా అంగీకరించారు’ అని వివరించారు.

ఛుగ్‌తో ఎర్రబెల్లి ప్రదీప్‌రావు భేటీ

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓ పార్టీ నేత ఇంట్లో తరుణ్‌ఛుగ్‌తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, తెరాసను వీడిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న కుమారుడు,  నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత బొమ్మ శ్రీరామ్‌ చక్రవర్తి భేటీ అయ్యారు. భాజపాలో చేరిక గురించి చర్చించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని