అమిత్‌షా సభకు భారీగా జన సమీకరణ

మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పోటీ తెరాసతోనే ఉంటుందని, అత్యధిక మెజార్టీ లక్ష్యంతో పనిచేయాలని కమలదళం నిర్ణయించింది. ఈనెల 21న సాయంత్రం నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించే భాజపా అగ్ర నేత అమిత్‌షా

Published : 18 Aug 2022 06:36 IST

 రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కమలదళం నిర్ణయం

కేసీఆర్‌ గ్రాఫ్‌ పడిపోయింది: సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పోటీ తెరాసతోనే ఉంటుందని, అత్యధిక మెజార్టీ లక్ష్యంతో పనిచేయాలని కమలదళం నిర్ణయించింది. ఈనెల 21న సాయంత్రం నల్గొండ జిల్లా మునుగోడులో నిర్వహించే భాజపా అగ్ర నేత అమిత్‌షా బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన పాలకుర్తి నియోజకవర్గం కిష్టాగూడెంలో ప్రజాసంగ్రామ యాత్ర శిబిరం వద్ద భాజపా రాష్ట్ర పదాధికారులు, ముఖ్యనేతల సమావేశం జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్‌ మునిగిపోతోందని, ఈ ఎన్నికల్లో తెరాసకు కాంగ్రెస్‌ లోపాయికారీగా సహకరిస్తుందని కమలనాథులు అభిప్రాయపడ్డారు. 21న మునుగోడులో జరిగే సభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరనున్నారు. సభకు ప్రధానంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల నుంచి జనసమీకరణకు నిర్ణయించారు. అమిత్‌షా సభ రోజున బండి సంజయ్‌ తన పాదయాత్రకు ఒకరోజు విరామం ఇవ్వనున్నారు.ఈ నేపథ్యంలో 26న ముగియాల్సిన పాదయాత్ర తేదీని 27కు మార్చారు.

ఎర్రగులాబీలుగా మారిన కమ్యూనిస్టులు

‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రాఫ్‌ పడిపోయింది. పరిస్థితిని భాజపాకు అనుకూలంగా మలుచుకుందాం. కమ్యూనిస్టులు ఎర్రగులాబీలుగా తెరాసకు అనుకూలంగా మారారు. జీహెచ్‌ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు భాజపాకే ఓటేశారు. మునుగోడులోనూ అదే జరుగుతుంది’ అని సంజయ్‌ అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలి అని అన్నారు. మునుగోడు బహిరంగ సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలకు మండలానికి ఇద్దరు సీనియర్‌ నేతలను బండి సంజయ్‌ నియమించారు. నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, జి.వివేక్‌ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, దాసోజ్‌ శ్రవణ్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు.

షెడ్యూల్‌ ఇదీ...

21న మధ్యాహ్నం 3.40 గంటలకు ప్రత్యేక విమానంలో అమిత్‌షా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. హెలికాప్టర్‌లో బయల్దేరి 4.15కి మునుగోడుకు చేరుకుంటారు. సాయంత్రం 4.40 నుంచి 6 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.25కి హెలికాప్టర్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 6.30కి విమానంలో దిల్లీకి బయల్దేరి వెళతారు.

రాష్ట్రంలో పార్టీ కార్యాచరణను ప్రకటించనున్న అమిత్‌ షా

మునుగోడు బహిరంగ సభ వేదికగా రాష్ట్రంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణను అమిత్‌షా ప్రకటిస్తారని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ ఛుగ్‌ వెల్లడించారు. దిల్లీలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. అవినీతిపై మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అమిత్‌షా సభతో తెలంగాణకు కుటుంబ రాజకీయాల నుంచి విముక్తి లభిస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని