కమీషన్ల కోసం కంపెనీల్ని తరిమేశారు

ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమల్ని తీసుకురాలేదు సరికదా, కమీషన్ల కోసం ఉన్న కంపెనీలనే తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు

Published : 18 Aug 2022 05:19 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమల్ని తీసుకురాలేదు సరికదా, కమీషన్ల కోసం ఉన్న కంపెనీలనే తరిమేసి 34 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేశారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడమే తాను చేయబోయే మొదటిపని అంటూ ఎన్నికల ప్రచారంలో యువతకు జగన్‌ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ‘‘మూడేళ్లు దాటినా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకుండా యువతను వంచించారు. ఉపాధి, ఉద్యోగాల కల్పనలో రాష్ట్రం పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా పారిశ్రామికరంగాన్ని ప్రాధాన్యరంగంగా గుర్తించకపోవడంతో నిరుద్యోగ యువత భవిత ప్రశ్నార్థకమైంది. ఏటా రూ.లక్షలు ఖర్చు పెట్టి వివిధ కోర్సులు చేసి బయటకు వస్తున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే సమర్థత ఈ ప్రభుత్వానికి లేదు’’ అని యనమల పేర్కొన్నారు. ‘‘వైకాపా పాలనలో రాష్ట్రానికి కొత్తగా వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాలు లేవు. నిరుద్యోగం పెరుగుతోంది’’ అని ఆయన దుయ్యబట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని