కోర్టులు చీవాట్లు పెట్టినా మార్పు రాదా?

న్యాయస్థానాలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టి, మొట్టికాయలు వేసినా రాష్ట్రంలో పోలీసులు, సీఐడీ అధికారుల తీరు మారడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు

Published : 25 Sep 2022 05:41 IST

కింజరాపు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: న్యాయస్థానాలు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టి, మొట్టికాయలు వేసినా రాష్ట్రంలో పోలీసులు, సీఐడీ అధికారుల తీరు మారడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీలో కొత్త చట్టాలను, రాజ్యాంగాన్ని ఏమైనా అనుసరిస్తున్నారా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థకు జగన్‌రెడ్డి చెడ్డపేరు తెస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్న అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని శనివారం ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. ‘‘ఓ అధికారి అవినీతికి పాల్పడ్డారనే వార్తను షేర్‌ చేసిన పాపానికి 73 ఏళ్ల పాత్రికేయుడిని అక్రమంగా అరెస్టు చేసిన తీరు సమాజాన్ని నివ్వెరపరిచింది. అవినీతి ఆరోపణ వచ్చిన అధికారులను విచారించకుండా వార్తలు రాసే పాత్రికేయులకు సంకెళ్లు వేస్తారా? జగన్‌రెడ్డి చెప్పిన ప్రతి దానికీ తలాడించే అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఇది ఇలాగే కొనసాగితే పోలీసు వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుంది. డీజీపీ కలగజేసుకొని తక్షణమే సీఐడీని ప్రక్షాళన చేయాలి. నిబంధనలు పాటించకుండా, తప్పుడు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులు చేస్తూ, కోర్టు నుంచి షోకాజ్‌ నోటీసులు అందుకోవడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి...’’ అని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబు విడుదలపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు, సీఐడీకి న్యాయస్థానం ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.


జగన్‌ పోలీసులనూ జైలుపాలు చేయబోతున్నారు
- తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్‌ అధికారులను జైళ్లకు తీసుకెళితే..జగన్‌ హయాంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లతో పాటు పలువురు పోలీసు అధికారులను జైలుపాలు చేయబోతున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. కొందరు అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్‌రెడ్డి ఉచ్చులో పడి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని శనివారం ట్విటర్‌ వేదికగా విమర్శించారు. ‘‘41ఏ నోటీసులివ్వకుండా సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబును ఎందుకు అరెస్టు చేశారంటూ సీఐడీ అధికారులపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పదేపదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారుల తీరు మారడం లేదు. గీత దాటి ప్రవర్తిస్తున్న వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు ఎందుకు తప్పు చేశామా అని జీవితాంతం బాధపడటం ఖాయం...’’ అని నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

చారిత్రక తప్పిదం చేశారు

విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించి జగన్‌ చారిత్రక తప్పిదం చేశారని నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.‘‘ మీరేదైనా కట్టి మీ నాన్న పేరు పెట్టుకుంటే అందరూ ఆహ్వానించేవారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపు నిర్ణయంపై జగన్‌ కుటుంబ సభ్యులు సైతం ఛీ కొడుతున్నారు’’ అని శనివారం లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.


ఎన్టీఆర్‌ కుటుంబంపై అవాకులు,చవాకులు పేలితే సహించం
- మంత్రి జోగి రమేశ్‌కు  కేఎస్‌ జవహర్‌ హెచ్చరిక

తన స్థాయిని మరచి మంత్రి జోగి రమేశ్‌ ఎన్టీఆర్‌ కుటుంబంపై అవాకులు, చవాకులు పేలుతున్నారని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ మండిపడ్డారు. వైఎస్సార్‌ మృతదేహాన్ని పక్కనపెట్టుకొని సీఎం పదవి కోసం జగన్‌ సంతకాలు సేకరించిన విషయం ఆయన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు.  ఎన్టీఆర్‌ కుటుంబం గురించి ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని శనివారం ఓ వీడియో ప్రకటనలో హెచ్చరించారు. ‘‘ఎన్టీఆర్‌ కుటుంబాన్ని తిట్టడానికే జోగి రమేశ్‌ విలేకరుల సమావేశం పెట్టారు. అప్పటి పరిస్థితుల్లో పార్టీని రక్షించుకోవడానికి హరికృష్ణ, బాలకృష్ణలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారు...’’ అని జవహర్‌ పేర్కొన్నారు.

పదవులన్నీ రెడ్లకు... పనులు బీసీలకా?
- మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

జగన్‌ పాలనలో పదవులన్నీ రెడ్లకు.. ఆయన ఇంట్లో పనిచేయడానికి మాత్రం బీసీలా అని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రశ్నించారు. పులివెందులలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కిన జగన్‌కు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఉమ్మడి కడప జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాల్లో 9 రెడ్లకు ఇవ్వడమేనా బీసీ ఉద్ధరణంటే? తెదేపా హయాంలో తితిదే ఛైర్మన్లుగా ఇద్దరు బీసీలను నియమిస్తే జగన్‌ .. రెడ్డికి ఇచ్చారు. కడప జిల్లాలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వారంతా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చంద్రబాబు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. జగన్‌ దాన్ని 24 శాతానికి కుదించారు...’’ అని కూన రవికుమార్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని