Congress: హస్తినకు.. రాజస్థాన్‌ కుస్తీ

సంక్షోభం అంచున నిలిచిన రాజస్థాన్‌ రాజకీయం సోమవారం దిల్లీకి మారింది. జైపుర్‌లో మకాం వేసిన పార్టీ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకన్‌ అక్కడి నుంచి హస్తినకు వెనుదిరిగి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పరిస్థితి నివేదించారు. ఈ భేటీ గంటకు పైగా కొనసాగింది.

Updated : 27 Sep 2022 06:52 IST

దిల్లీకి వచ్చి సోనియాతో భేటీ అయిన పరిశీలకులు

జైపుర్‌ పరిణామాలపై పార్టీ అధ్యక్షురాలి అసంతృప్తి

గహ్లోత్‌తో దౌత్యం నెరపనున్న కమల్‌నాథ్‌

జైపుర్‌, ఈటీవీ భారత్‌-దిల్లీ

సంక్షోభం అంచున నిలిచిన రాజస్థాన్‌ రాజకీయం సోమవారం దిల్లీకి మారింది. జైపుర్‌లో మకాం వేసిన పార్టీ పరిశీలకులు మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకన్‌ అక్కడి నుంచి హస్తినకు వెనుదిరిగి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పరిస్థితి నివేదించారు. ఈ భేటీ గంటకు పైగా కొనసాగింది. మొత్తం పరిణామాలపై మంగళవారం రాతపూర్వకంగానూ పరిశీలకులు సవివర నివేదిక సమర్పించనున్నారు. పార్టీలో ధిక్కార ధోరణి తలెత్తడంపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తాను ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టాల్సి వచ్చినా ముఖ్యమంత్రి పీఠాన్ని మాత్రం యువనేత సచిన్‌ పైలట్‌కు అప్పగించేది లేదంటూ తేల్చి చెబుతుండడంపై హైకమాండ్‌ తీవ్రంగానే దృష్టి సారించింది. ఆయనతో సత్సంబంధాలున్న మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను వెంటనే రావాల్సిందిగా ఆదేశించింది. సాయంత్రమే దిల్లీకి చేరుకున్న ఆయన సోనియాగాంధీతో సమావేశమయ్యారు. గహ్లోత్‌ను బుజ్జగించే పనిని అధ్యక్షురాలు ఆయనకు అప్పగించారు. పదవులకు రాజీనామా చేస్తామంటూ ప్రకటించిన 92 మంది ఎమ్మెల్యేలు (వీరిలో 10 మంది స్వతంత్రులు) సంబంధిత లేఖలను సోమవారం తెల్లవారుజామున స్పీకర్‌ జోషికి అందజేశారు. ఆ తర్వాత నవరాత్రి వేడుకల కోసం సొంత నియోజకవర్గాలకు పయనమయ్యారు. గహ్లోత్‌ చుట్టూ తిరుగుతున్న పరిణామాలపై 10 జన్‌పథ్‌ నుంచి వెలువడే నిర్ణయం కోసం పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.

ఖర్గేతో గహ్లోత్‌ భేటీ

సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గేతో గహ్లోత్‌ భేటీ అయ్యారు. అనంతరం ఖర్గే మాట్లాడుతూ.. ‘రాజస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులను అధిష్ఠానానికి వివరించాం. అధ్యక్షురాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, పార్టీ నేతలంతా దాన్ని పాటించాలి. పార్టీలో క్రమశిక్షణ ఉండాలి’ అని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవికి గహ్లోత్‌కు ప్రత్యామ్నాయంగా పలువురు సీనియర్‌ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దిగ్విజయ్‌ సింగ్‌ లేదా ముకుల్‌ వాస్నిక్‌ను గాంధీ కుటుంబం సూచించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్‌ కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. సంస్థాగత ఎన్నికల తర్వాతే రాజస్థాన్‌లో తదుపరి సీఎంను ఎంచుకోవాలని గహ్లోత్‌ వర్గం డిమాండ్‌ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సీఎం పదవి రేసులో ముందున్న సచిన్‌ పైలట్‌ కూడా అధిష్ఠానాన్ని కలిసి అభిప్రాయాలు పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

భాజపా వ్యంగ్యాస్త్రాలు   

కాంగ్రెస్‌పై భాజపా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది. గతంలో గహ్లోత్‌, పైలట్‌ కలిసి రాహుల్‌ గాంధీతో దిగిన ఓ ఫొటోను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ట్విటర్‌లో చేరుస్తూ.. ‘ముందు వీరిద్దరినీ కలపండి’ అంటూ వ్యాఖ్యానం జోడించారు. ‘శిబిరాల ప్రభుత్వం. మరోసారి రిసార్టులకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది’ అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో పరిస్థితులు రాష్ట్రపతి పాలన దిశగా సాగుతున్నాయని శాసనసభలో భాజపా ఉపనేత రాజేంద్ర రాఠోడ్‌ అభిప్రాయపడ్డారు.


అధ్యక్ష బరిలో ఉంటారా?

తాజా పరిణామాల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి బరిలో గహ్లోత్‌ నిలుస్తారా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి అనేది పార్టీ అంతర్గత ఎన్నికలకు వర్తించదని గహ్లోత్‌ వాదిస్తున్న విషయం తెలిసిందే. మారిన పరిణామాల్లో ఆయన్ని అధ్యక్ష పదవి పోటీనుంచి తప్పించాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ‘ఇంత జరిగిన తర్వాత ఆయన (గహ్లోత్‌)పై విశ్వాసం ఉంచడం, పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం మంచిది కాదు. అధినాయకత్వ పదవికి ఆయన అభ్యర్థిత్వంపై పునరాలోచించండి’ అని సీడబ్ల్యూసీ సభ్యులు కోరినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండే మరో సీనియర్‌ నేతకు అవకాశం కల్పించాలని వారు సోనియాగాంధీని కోరినట్లు సమాచారం. అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని కమల్‌నాథ్‌ స్పష్టంచేసినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని