పార్టీలకు అతీతంగా కలిసిరావాలి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. అక్టోబరు 24 నుంచి రాష్ట్రంలో 13 రోజుల పాటు సాగే యాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ప్రాథమికంగా ఖరారైందన్నారు.

Published : 01 Oct 2022 04:43 IST

భారత్‌ జోడోయాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. అక్టోబరు 24 నుంచి రాష్ట్రంలో 13 రోజుల పాటు సాగే యాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ప్రాథమికంగా ఖరారైందన్నారు. శనివారం రాష్ట్ర డీజీపీని కలసి యాత్రకు భద్రత కల్పించాలని కోరనున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో జోడోయాత్ర నిర్వహణకు సంబంధించి పార్టీ అన్ని విభాగాలు సర్వసన్నద్ధం కావాలని సూచించారు. తెలంగాణలో రాహుల్‌ పాదయాత్ర నిర్వహణపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, యాత్ర కన్వీనర్‌ బలరాం నాయక్‌, ముఖ్యనేతలు పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహా, రేణుకాచౌదరి, సీతక్క, మధుయాస్కీ, కోదండరెడ్డి, అజహరుద్దీన్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌, దామోదర్‌రెడ్డి, వేంనరేందర్‌రెడ్డి, శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నేతలతో కలిసి రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

రాహుల్‌ రాష్ట్రంలోని మక్తల్‌ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి జుక్కల్‌ సెగ్మెంట్‌ మీదుగా రాష్ట్రం దాటేవరకు ప్రతి రోజూ పూర్తిగా ఉపయోగకరంగా ఉండేలా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు రేవంత్‌ తెలిపారు. జోడోయాత్రపై ఈ నెల 4న ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌సింగ్‌, జైరాం రమేష్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో రూట్‌మ్యాప్‌ సహా అన్ని అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మక్తల్‌, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, శంషాబాద్‌, శేరిలింగంపల్లి, బీహెచ్‌ఈఎల్‌, సంగారెడ్డి, జోగిపేట, శంకరంపేట, మద్నూర్‌ల మీదుగా యాత్ర సాగనుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన మిలియన్‌మార్చ్‌, సకలజనుల సమ్మె, సాగరహారం సహా ఏ కార్యక్రమాన్ని కూడా తెరాస ఒక్కటే చేయలేదని, వీటిలో కేటీఆర్‌ లేరనే విషయాన్ని గుర్తించాలని రేవంత్‌ అన్నారు. తనను విమర్శించే వారు ప్రత్యేక రాష్ట్రం కోసం శాసనసభలో తాను మాట్లాడిన అంశాలను పరిశీలించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని